న్యూఢిల్లీ, డిసెంబర్ 9 : విమానాల రద్దు, ఆలస్యంతో గత వారం రోజులుగా దేశీయ విమానయాన రంగాన్ని అస్తవ్యస్తం చేసి సంక్షోభం సృష్టించిన ఇండిగో సంస్థపై కేంద్రం ఎట్టకేలకు చర్యలకు దిగింది. ఇక నుంచి ఇండిగో తన కార్యకలాపాలను 10 శాతం తగ్గించుకోవాలని ఆదేశించింది. తొలుత ఇండిగోకు 5 శాతం సర్వీసులనే తగ్గించాలని భావించినా తర్వాత దానిని 10 శాతానికి పెంచి, రివైజ్డ్ నోటిఫికేషన్‌ను ఇండిగోకు పంపింది. ప్రస్తుతం ఇండిగో రోజుకు దేశీయ, అంతర్జాతీయంగా 2,200 విమానాలను నడుపుతుండగా, కొత్త ఆదేశాలతో 200కు పైగా విమానాలను ఆ సంస్థ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తగ్గించిన స్లాట్లను ఎయిరిండియా, ఆకాశ్, స్పైస్‌జెట్ లాంటి సంస్థలకు కేటాయిస్తారు.
ఇండిగో విమానాల రద్దు మంగళవారం కూడా కొనసాగింది. తాజాగా 500 విమానాలు రద్దు చేసినట్టు సంస్థ ప్రకటించింది. అయితే ఎయిర్‌లైన్స్ తన కాళ్లపై నిలబడిందని, దాని కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. నెట్వర్క్, విమానాలను పునరుద్ధరించడానికి తమ బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయని, అదే సమయంలో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలపై అంతర్గత సమీక్ష ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. విమానాల రద్దు వల్ల ప్రయాణికులకు ఏర్పడిన అసౌకర్యం, ఇబ్బందులకు మరోసారి క్షమాపణలు చెప్పారు.
ఇండిగో విమాన సంక్షోభం కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ మంత్రులు, ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియమ నిబంధనలు బాగా ఉండి, అవి వ్యవస్థను మెరుగుపరచాలే తప్ప వారిని బాధించేలా ఉండకూడదని ప్రధాని ఈ సమావేశంలో పేర్కొన్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు చెప్పారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థ అయినా ఉపేక్షించబోమని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టంచేశారు. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. ఇండిగోకు ఇప్పటికే డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీచేసిందని, దర్యాప్తు కూడా మొదలైందని చెప్పారు.