Indigo Crisis | ఇటీవల ఇండిగో సంక్షోభం సమయంలో విమాన చార్జీలు విపరీతంగా పెరిగాయి. దాంతో కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దిగి టికెట్ల ధరలపై పరిమితిని విధించింది. తాజాగా విమాన చార్జీల నియంత్రణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. విమాన టికెట్ల ఛార్జీలను ఏడాది పొడువునా నియంత్రించలేమని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో స్పష్టం చేశారు. పండుగల సమయంలో టికెట్ల ధరల పెరుగుతాయని.. ఛార్జీలపై దేశవ్యాప్తంగా పరిమితి విధించడం ఆచరణాత్మకం కాదని తెలిపారు. నియంత్రణ లేని మార్కెట్ కారణంగా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రంగం అభివృద్ధి చెందడానికి నియంత్రణ సడలింపులు జరిగాయన్న ఆయన.. అసాధారణ వృద్ధిని చూసిన ఇతర దేశాలు నియంత్రణ ఎత్తివేసిందన్నారు.
దాంతో మరిన్ని కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించేలా ప్రోత్సహిస్తుందని చెప్పారు. మార్కెట్ డైనమిక్స్ ఆధారంగా ధరలుంటాయని.. అంతిమంగా ప్రయాణీకులు అతిపెద్ద లబ్ధిదారులుగా నిలుస్తారన్నారు. విమాన ఛార్జీలపై నియంత్రణ ఎత్తివేయాలని కోరుతూ ఓ సభ్యుడు ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఆయన స్పందించారు. నియంత్రణ సడలింపు ఆలోచన ఇప్పటికీ కొనసాగుతోందని.. మనం పౌర విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే, అతి ముఖ్యమైన అవసరం ఏమిటంటే.. మరిన్ని కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించగలిగేలా దానిపై నియంత్రణలు తొలగించడమేనన్నారు. మార్కెట్ నియంత్రణ సడలింపు ఉన్నప్పటికీ.. ప్రస్తుత రూపంలో ఉన్న విమాన చట్టం దుర్వినియోగం జరిగే అవకాశం ఉన్న అసాధారణ పరిస్థితులలో జోక్యం చేసుకుని పరిస్థితిని సరిదిద్దే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుందని.. ఇందులో ప్రయాణీకుల నుంచి అసమంజసమైన ఛార్జీలను నివారించడానికి చార్జీలపై పరిమితిని నిర్ణయించడం సైతం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.