న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) ట్రావెల్ అడ్వైజరీ ప్రకటించింది. డ్రోన్లు, మిసైళ్ల దాడులు కొనసాగుతుండటంతో దేశంలోని పది నగరాలకు విమాన సర్వీసులను రద్దుచేసింది. ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని నగరాలకు శనివారం అర్ధరాత్రి వరకు విమానాల రద్దు కొనసాగుతుందని వెల్లడించింది. దీనివల్ల శ్రీనగర్, జమ్ము, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనేర్, జోధ్‌పూర్, కిషన్‌గఢ్, రాజ్‌కోట్ సర్వీసులపై ప్రభావం ఉంటుందని తెలిపింది.
ప్రయాణికులు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదించాలని పేర్కొంది. పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. తదుపరి సమాచారం, విమానాల రాకపోకల్లో మార్పులు చేర్పులకు సంబంధించి ప్రయాణికులు అధికారిక చానల్స్ ద్వారా మాత్రమే తెలుసుకోవాలని సూచించింది. ప్రయాణికుల సంక్షేమ కోసమే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కాగా, పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, జమ్ముకశ్మీర్, లడఖ్, రాజస్థాన్, గుజరాత్‌లోని 24న విమానాశ్రయాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తాత్కాలికంగా మూసివేసింది. ఈ క్రమంలో పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీని జారీ చేశాయి.
స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ జారీ చేసిన అడ్వైజరీలో ప్రయాణికులు తప్పనిసరిగా మూడుగంటల ముందుగానే ఎయిర్‌పోర్ట్‌లకు చేరుకోవాలని సూచించింది. అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు పెంచినట్లు పేర్కొంది. భద్రతా చర్యలు, చెక్-ఇన్, బోర్డింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రయాణికులు మూడుగంటల ముందుగానే ఎయిర్‌పోర్టులకు చేరుకోవాలని సూచించింది. అలాగే ఇండిగో సైతం సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ అసాధారణ సమయంలో అన్ని విమానాశ్రయాలలో కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. తాజాగా పది పట్టణాలకు ఇండిగో తన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.