న్యూఢిల్లీ: భారతీయ ఎగుమతులపై ట్రంప్ 50% సుంకాలు విధించిన తర్వాత అమెరికా నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో రష్యా చమురు కొనుగోళ్లను భారతీయ రిఫైనరీలు తగ్గించి వేసినట్లు బ్లూమ్బర్గ్ వెల్లడించింది. రానున్న రోజుల్లో రష్యా నుంచి చమురును కొనుగోలు చేయరాదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి రిఫైనరీలు నిర్ణయించాయని తెలిపింది.
అక్టోబర్లో రష్యా నుంచి నౌకలలో భారత్కు ముడి చమురు బయల్దేరాల్సి ఉంటుంది. రిఫైనరీల తాజా నిర్ణయంతో రష్యా నుంచి చమురు సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది. కొత్త ఆర్డర్లు ఇవ్వడానికి ముందు ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాల కోసం రిఫైనరీలు ఎదురుచూస్తున్నాయి.