న్యూఢిల్లీ, జూన్ 30: లింగ సమానత్వంలో భారత్ ర్యాంకు మరింత దిగజారింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సోమవారం విడుదల చేసిన 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికలో మొత్తం 148 దేశాలకు గాను భారత్ 131వ ర్యాంకు సాధించింది. గత ఏడాది కంటే రెండు స్థానాలు కోల్పోయింది. కొన్ని రంగాలలో భారత్ లింగ అసమానతను తగ్గించుకున్నప్పటికీ ఇతర దేశాలు మరింత వేగంగా ముందుకు వెళ్లడంతో భారత్ ర్యాంకు మరింత తగ్గిపోయింది. అయితే దక్షిణాసియాలో భారత్ తన పొరుగు దేశాల కన్నా వెనుకపడడం ఆందోళన కలిగించే అంశం. బంగ్లాదేశ్ (24), భూటాన్ (119), నేపాల్ (125), శ్రీలంక (130) మనకంటే ముందంజలో ఉన్నాయి.
ఆర్థిక భాగస్వామ్యం, విద్యాపరమైన సాధికారత, ఆరోగ్యం, మనుగడ, రాజకీయ సాధికారత అనే నాలుగు సూచీలపై లింగ అసమానతను నిర్ణయించడం జరుగుతుంది. భారత్ విషయానికి వస్తే విద్య, ఆరోగ్యంలో ముందడుగు పడినప్పటికీ రాజకీయ, ఆర్థిక సూచీలు వెనుకడుగు వేస్తున్నాయి. లింగ సమానతను 92.6 శాతం స్కోరుతో మొదటి స్థానాన్ని వరుసగా 16వ సంవత్సరం ఐస్‌ల్యాండ్ దక్కించుకుంది. ఆర్థిక సూచీకి సంబంధించి 2022 నుంచి తన లింగ అసమానతను 90 శాతానికి పైగా పూడ్చుకున్న ఏకైక దేశంగా ఐస్‌ల్యాండ్ నిలిచింది.
ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల కల్పనలో ప్రపంచంలోని అత్యంత దారుణంగా ఉన్న దేశాల సరసన భారత్ చేరింది. సూడాన్, పాకిస్థాన్ తదితర సంక్షుభిత దేశాల కన్నా అధికంగా 144వ ర్యాంకును భారత్ సాధించుకుంది. భారతీయ కంపెనీలలో జూనియర్ లెవల్ స్థాయిలో జరిగే నియామకాలలో ప్రతి ముగ్గురిలో ఒక మహిళ మాత్రమే ఉంటున్నట్లు నివేదిక పేర్కొంది. అలా పై స్థానాలకు వెళ్లే కొద్దీ వారి సంఖ్య తగ్గుతూ పోతున్నదని నివేదిక తెలిపింది. భారత కార్పొరేట్‌లోని బోర్డు పదవులలో కేవలం 18.2 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు వెల్లడించింది. మహిళల ఆర్థిక భాగస్వామ్యం స్వల్పంగా మెరుగుపడినప్పటికీ పురుషులతో సమానంగా వారి వేతనం ఉండడం లేదని నివేదిక పేర్కొంది. పురుషుడు చేసే అదే పనికి మహిళకు కేవలం మూడోవంతు వేతనం మాత్రమే లభిస్తున్నదని తెలిపింది. మహిళా కార్మికుల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉందని నివేదిక పేర్కొన్నది. భారత్‌లో మహిళల రాజకీయ భాగస్వామ్యం కూడా చాలా తక్కువగా ఉంది.
పార్లమెంట్లో మహిళల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 14.7 శాతం నుంచి 13.8 శాతానికి పడిపోయింది. ప్రభుత్వంలో మహిళా మంత్రుల వాటా 6.5 శాతం నుంచి 5.6 శాతానికి తగ్గింది. 2019లో ఇది అత్యధికంగా 30 శాతం ఉంది. మొత్తమ్మీద గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధికారంలో ఉన్న మహిళల సంఖ్య తగ్గిపోయిందని చెప్పవచ్చు.