Everest Masala | హైదరాబాద్, ఏప్రిల్ 22 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): భారత్‌కు చెందిన మసాలా ఉత్పత్తుల కంపెనీ ‘ఎవరెస్ట్’కు మరో షాక్ తగిలింది. ఇటీవల సింగపూర్‌లో వేటుకు గురైన ఈ కంపెనీపై తాజాగా హాంకాంగ్ కూడా బ్యాన్ విధించింది. ఎవరెస్ట్‌తో పాటు భారత్‌కు చెందిన మరో కంపెనీ ఎండీహెచ్‌కు చెందిన మసాలా ఉత్పత్తులపై కూడా నిషేధం విధిస్తున్నట్టు హాంకాంగ్‌కు చెందిన ఆహార భద్రత నియంత్రణ సంస్థ (సీఎఫ్ఎస్) వెల్లడించింది.
తమ పౌరులెవ్వరూ ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని సూచించింది. ఈ మసాలాల్లో ఇథలిన్ ఆక్సైడ్ మోతాదుకు మించి ఉన్నట్టు పేర్కొంది. కాగా, విదేశాల్లో నిషేధానికి గురైన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలు భారత్‌లో కూడా విక్రయిస్తుండటంతో ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ కంపెనీలకు చెందిన మసాలాలను సేకరించి ప్రయోగశాలలో నమూనాలను పరీక్షిస్తున్నట్టు ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా, 2023లో ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలాను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇథిలిన్ ఆక్సైడ్‌కు మండే స్వభావం ఉంటుంది. వ్యవసాయం, హెల్త్ కేర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలలో పురుగుమందుల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, కీటకాల నుంచి ఆహారాన్ని రక్షించడానికి కూడా వాడుతారు. మోతాదుకు మించి ఇది శరీరంలోకి చేరితే రొమ్ము క్యాన్సర్‌తో పాటు నాడీమండల వ్యవస్థ, మెదడు, డీఎన్ఏపై దుష్ప్రభావం చూపే ప్రమాదమున్నదని వైద్య నిపుణులు చెప్తున్నారు.