Supreme Court : ఈ నెల 7న ‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో (India’s Got Latent Show)’ లో బూతు వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్లహబాదియా (Ranveer Allahbadia) కు సుప్రీం కోర్టు (Supreme Court) చీవాట్లు పెట్టింది. హాస్యం కోసం పబ్లిక్ షోలలో బూతు జోకులు వేయడం ప్రతిభ అనుకుంటున్నావా..? అని మందలించింది. అదే సమయంలో ఆయన తన ‘ది రణ్వీర్ షో (The Ranveer Show)’ ను పునఃప్రారంభించడానికి సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది.
అయితే తన షోలో చేసే ప్రసారాలు మన సామాజిక నిబంధనలకు లోబడి ఉండాలని సూచించింది. ఏదైనా ప్రోగ్రామ్లో ప్రసారం చేయకూడని అంశాల గురించి, అందుకు సంబంధించిన నియమ నిబంధనల గురించి ప్రభుత్వం ప్రచారం చేయాలని సూచించింది. తన ‘రణ్వీర్ షో’ పునఃప్రారంభానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రణ్వీర్ అలహబాదియా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు పైవిధంగా స్పందించింది.
కాగా ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో ఈ నెల 17న యూట్యూబర్ రణ్వీర్ అలహబాదియా ఓ కంటెస్టెంట్కు బూతు ప్రశ్న వేశాడు. మీ పేరెంట్స్ శృంగారాన్ని మీరు ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారా..? లేదంటే అంతటితో ఆపేస్తారా..? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పబ్లిక్ షోలో ఇలాంటి ప్రశ్న అడగటం ఏమిటని పలువురు మండిపడ్డారు. దాంతో రణ్వీర్ షోను బ్యాన్ చేశారు. ఆయనపై కేసులు నమోదు చేశారు.