న్యూఢిల్లీ : భారత్‌లో అభివృద్ధి చేసిన మొదటి డెంగ్యూ టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ‘టెట్రావాక్స్-విడి’ అని పిలుస్తున్నారు. నాలుగు రకాల డెంగ్యూ జ్వరాల నుంచి రక్షణ కల్పించేందుకు దీన్ని తయారుచేశారు. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌కు వివిధ నేపథ్యాలు కలిగిన వేలాది వలంటీర్ల పేర్ల నమోదు దాదాపు పూర్తయ్యింది. దీని ద్వారా ఈ టీకా ఒక సమూహం లేదా వర్గానికి వాస్తవంగా డెంగ్యూ రాకుండా అడ్డుకుంటుందా అనేది పరిశీలిస్తారు.
కీలకమైన ఈ మూడో దశ ట్రయల్స్ ప్రారంభ ఫలితాలు సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. ఈ దశ ట్రయల్స్‌లో వలంటీర్లకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా, డెంగ్యూ నుంచి వారికి రక్షణ కల్పించడం ఎలా అనే విషయాలను పర్యవేక్షిస్తారు. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో శాస్త్రవేత్తలు డాటాను విశ్లేషిస్తారు. ఫలితాలు బాగుంటే, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు సంవత్సరంలోపు ఈ టీకాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది.