Matsya 6000 | చెన్నై, డిసెంబర్ 23 : అంతుచిక్కని రహస్యాలకు, అబ్బురపరిచే ఖనిజ సంపదకు నెలవు సముద్రం. ఎక్కడో దూరాన ఉన్న చంద్రుడి, అంగారకుడి గుట్టును సైతం కనిపెడుతున్న మాడ్రన్ సైన్స్.. మన భూమిపైనే ఉన్న సముద్రుడి సంగతులను మాత్రం పూర్తిగా పసిగట్టలేకపోతున్నది. సముద్ర అన్వేషణకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల్లో భారత్ సైతం ముందంజలో ఉంది. ఈ దిశగా ‘సముద్రయాన్’ మిషన్‌కు సిద్ధమవుతున్నది. 2026లో అంతరిక్షానికి మనుషులను పంపాలనే లక్ష్యంతో చేపడుతున్న గగన్‌యాన్‌తో పాటు సముద్రయాన్ మిషన్‌ను సైతం భారత్ చేపట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ) మత్య్స 6000 పేరుతో ఒక సబ్మెర్సిబుల్ను తయారు చేసింది. వచ్చే వారమే దీనిని మొదటిసారిగా హార్బర్ టెస్ట్ చేయనున్నారు.
సముద్రగర్భంలో దాగి ఉన్న ఖనిజాలను అన్వేషించడానికి, సముద్రాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి సముద్రయాన్ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఈ మిషన్‌కు మొత్తం రూ.4,077 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పాలిమెటాలిక్ నొడ్యూల్స్(పీఎంఎన్) అన్వేషణకు మధ్య హిందూ సముద్ర ప్రాంతాన్ని ఇప్పటికే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ భారత్‌కు అప్పగించింది. భారత్‌కు కేటాయించిన సముద్రగర్భంలో దాదాపు 75 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో నికెల్, రాగి, మాంగనీస్, కోబాల్ట్ వంటి ఖనిజాలతో కూడిన పీఎంఎన్లు విస్తరించి ఉన్నాయి. ఒక పైలట్, ఒక కోపైలట్, మరో పరిశోధకుడు ఈ సబ్మెర్సిబుల్లో సముద్రగర్భంలోకి వెళ్లనున్నారు. 12 గంటల పాటు ఈ ప్రయోగం కొనసాగనుంది. అత్యవసర పరిస్థితుల్లో 96 గంటల వరకు పొడిగించవచ్చు. 7,517 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉన్న భారత్‌కు ఈ ప్రయోగం చాలా కీలకంగా మారింది.
సముద్రయాన్ కోసం మొదట విదేశాల నుంచి సబ్ మెర్సిబుల్‌ను కొనుగోలు చేయాలని ఎన్ఐఓటీ అనుకొని టెండర్లు పిలిచింది. అయితే, ఇది ఆర్థికంగా భారం కావడంతో పాటు ఈ ప్రయోగం కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తుందనే కారణంతో దేశీయ సాంకేతికతతో మత్య్స 6000ను సొంతంగా అభివృద్ధి చేసింది. ఇది నాలుగో తరం సబ్ మెర్సిబుల్ అని ప్రాజెక్ట్ డైరెక్టర్ వేదాచలం తెలిపారు. 28 టన్నుల బరువుండే ఈ సబ్‌మెర్సిబుల్‌కు రెండు రోబోటిక్ చేతులు ఉంటాయి. ఇవి సముద్రగర్భం నుంచి ఖనిజ నమూనాలను సేకరిస్తాయి. ఇందులో ప్రపంచంలోనే మొదటిసారిగా లీథియం పాలిమర్ బ్యాటరీలను వాడుతున్నారు. మదర్ షిప్ నుంచి దీనిని నియంత్రిస్తారు. ఒకవేళ నియంత్రణ కోల్పోయినా అత్యవసర పరిస్థితుల్లో ఇందులోని సిబ్బందిని రక్షించడానికి మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించారు. 6000 అడుగుల లోతులో మానవ శరీరంపై భూఉపరితలంతో పోలిస్తే 600 రెట్లు అధికంగా నీటి ఒత్తిడి ఉంటుంది. దీనికి తగ్గట్టుగా ధృఢంగా మత్స్య 6000ను తయారుచేశారు.
సబ్ మెర్సిబుల్‌ను ప్రొపెల్లర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇలా వివిధ భాగాలుగా వేర్వేరుగా తయారుచేశారు. ఇప్పుడు వీటిని జతపరిచి మొదటి దశలో భాగంగా హార్బర్ టెస్ట్ చేయనున్నారు. ఇందులో ముగ్గురిని బంగాళాఖాతంలో 15 మీటర్ల లోతుకు పంపిస్తారు. ఈ పరీక్ష సజావుగా సాగితే వచ్చే ఏడాది 100 మీటర్లు, 200 మీటర్లు, 500 మీటర్ల లోతుకు పంపించే పరీక్షలు జరుపుతారు. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తయితే మధ్య హిందూ సముద్రంలో 2026 చివరన సముద్రయాన్ అసలు ప్రయోగం ఉంటుంది. వాస్తవానికి హార్బర్ టెస్టు డిసెంబర్ మధ్యలోనే పూర్తి కావాల్సిన ఉన్నా.. ఫెంగల్ తుఫాను వల్ల ఆలస్యమైంది.