న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ప్రపంచ దేశాలను ఠారెత్తిస్తున్న ‘ఒమిక్రాన్’ వేరియంట్ తాజాగా భారత్‌లోనూ అడుగుపెట్టింది. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది. బాధితులిద్దరూ పురుషులని, ఇందులో ఒకరు విదేశాల నుంచి వచ్చారని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. వీరిలో స్వల్ప లక్షణాలను మాత్రమే గుర్తించామని వెల్లడించారు. బాధితుల్లో ఒకరి వయసు 66 ఏండ్లు, మరొకరికి 46 ఏండ్లు కాగా, గోప్యతా కారణాల వల్ల పేర్లను వెల్లడించడం లేదన్నారు. కర్ణాటకలో వీరిద్దరికీ కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో జన్యుక్రమ విశ్లేషణ కోసం వారి నమూనాలను ఇన్సాకాగ్కు పంపించామన్నారు. ఒమిక్రాన్ నిర్ధారణ కాగానే ఇద్దరు బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి, వారికీ టెస్టులు జరిపినట్టు వెల్లడించారు. బాధితుల్లోని రెండో వ్యక్తి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులోని ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు, వీరి నమూనాలను ఇన్సాకాగ్కు పంపించినట్టు సమాచారం. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాల అధికారులతో కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం సమావేశమయ్యారు.
దేశంలో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడటంపై ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. అయితే, వైరస్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించవద్దని సూచించింది. ముఖానికి మాస్కు, భౌతిక దూరం పాటించడం, తరుచూ చేతులను శానిటైజ్ చేసుకోవడం, వ్యాక్సిన్ వేసుకోవడం వంటి నిబంధనలను పాటించాలని సూచించింది. భారత్‌లో ఇప్పటివరకూ 84.3 శాతం మంది తొలిడోసు టీకా, 49 శాతం మంది రెండు డోసుల టీకా వేసుకున్నట్టు వివరించింది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 29 దేశాల్లో (భారత్ కాకుండా) 373 ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్టు కేంద్రం తెలిపింది. వివిధ దేశాల్లోని కేసుల పరిస్థితిని భారత్ క్షుణ్ణంగా గమనిస్తున్నట్టు పేర్కొంది. కొత్త వేరియంట్ వల్ల తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నదా? లేదా? అని ఇప్పుడే చెప్పలేమన్నది. కాగా, ఒమిక్రాన్ తాజాగా గుర్తించిన ఇద్దరు బాధితుల్లో 66 ఏండ్ల వ్యక్తి దక్షిణాఫ్రికా దేశస్తుడు. మరొకరు బెంగళూరులో వైద్యుడు. ఇద్దరూ రెండు టీకాలు వేసుకున్నారు. నవంబర్ మూడో వారంలో వీరికి కరోనా సోకినట్టు తేలింది. ఒమిక్రాన్ తాజాగా నిర్ధారణ అయింది. అయితే, తొలి వ్యక్తి భారత్‌కు రాగానే పాజిటివ్‌గా గుర్తించామని, ఒమిక్రాన్ నిర్ధారణ కోసం అతని నుంచి శాంపిల్స్ సేకరించినట్టు కర్ణాటక అధికారులు తెలిపారు. అయితే, ప్రైవేట్ ల్యాబ్‌లో ఇచ్చిన నెగటివ్ సర్టిఫికెట్తో అతను 27న దుబాయ్ వెళ్లిపోయినట్టు చెప్పారు. ఇతని కాంటాక్టులను సేకరించి టెస్టులు చేయగా నెగటివ్ వచ్చినట్టు వెల్లడించారు.
ఒమిక్రాన్ తీవ్రతను ఇప్పటికిప్పుడు అంచనావేయడం కష్టమని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా యువతలోనే కనిపిస్తున్నాయన్నారు. వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి యువతలో ఎక్కువగా ఉండటంతో ‘ఒమిక్రాన్’ లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్టు గుర్తుచేశారు. ఎప్పుడైతే ఈ వేరియంట్ మిగతా వయసులవారికి వ్యాపిస్తుందో.. అప్పుడు దీని తీవ్రత ఏ మోతాదులో ఉంటుందో నిర్ధారణకు రావొచ్చన్నారు. దక్షిణాఫ్రికాలో నవంబర్ తొలివారంలో రోజుకు సగటున 200 కేసులు నమోదవ్వగా, ప్రస్తుతం రోజుకు సగటున 9 వేల కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ తొలిసారిగా ఇక్కడే వెలుగుచూడటం తెలిసిందే.
చాపకింద నీరులా విస్తరిస్తున్న ‘ఒమిక్రాన్’ను కట్టడి చేయడానికి పలు దేశాలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. 60 ఏండ్ల పైబడి, వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరించే వారికి ఇస్తున్న పింఛన్లో కోత విధించనున్నట్టు గ్రీస్ ప్రకటించింది. నెలవారీ పింఛన్లో 33 శాతం వరకు ఈ కటింగ్ ఉండనున్నట్టు హెచ్చరించింది. కొత్త వేరియంట్ వ్యాప్తికి కారణమయ్యే సూపర్ స్ప్రెడర్లను గుర్తించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం గూఢచార సంస్థల సాయాన్ని తీసుకుంటున్నది. వైరస్ కట్టడికి గతవారం నెదర్లాండ్స్‌లో విధించిన 5పీఎం లాక్‌డౌన్‌పై (5పీఎం నుంచి 5ఏఎం వరకు లాక్డౌన్) అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, పౌరుల క్షేమం కోసం ఆంక్షలు కొనసాగుతాయని అక్కడి ప్రభుత్వం పునరుద్ఘాటించింది.