రాయ్‌పూర్, మే 10 : అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (AEL) శనివారం భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన సెల్ ట్రక్కును ప్రారంభించింది. దీని ద్వారా కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించవచ్చు. ఈ హైడ్రోజన్-శక్తితో నడిచే ట్రక్కులు కంపెనీ లాజిస్టిక్స్ కార్యకలాపాల్లో ఉపయోగించే డీజిల్ వాహనాలను క్రమంగా భర్తీ చేయనున్నాయి. స్మార్ట్ టెక్నాలజీ, మూడు హైడ్రోజన్ ట్యాంకులతో కూడిన ప్రతి ట్రక్కు 200 కిలోమీటర్ల పరిధిలో 40 టన్నుల వరకు సరుకును తీసుకెళ్లగలదు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి రాయ్‌పూర్‌లో మొదటి ట్రక్కును జెండా ఊపి ప్రారంభించారు. గారే పెల్మా III బ్లాక్ నుండి రాష్ట్ర విద్యుత్ ప్లాంట్‌కు బొగ్గును రవాణా చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది.
భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే ట్రక్కును ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభించడం రాష్ట్ర స్థిరత్వానికి నిబద్ధతను ప్రతిబింబిస్తుందని సీఎం అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మన కార్బన్ పాదముద్రను గణనీయంగా తగ్గిస్తాయియని, పరిశ్రమకు కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తాయని తెలిపారు. దేశ విద్యుత్ డిమాండ్లను తీర్చడంలో ఛత్తీస్‌గఢ్ ముందంజలో ఉండటమే కాకుండా స్థిరమైన పద్ధతులను అవలంబించడంలో కూడా ముందుందని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్, గారే పెల్మా III బ్లాక్‌కు గని డెవలపర్, ఆపరేటర్‌గా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా నియమించింది. ఈ ప్రాజెక్ట్ అదానీ నేచురల్ రిసోర్సెస్ (ANR) అదేవిధంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో భాగమైన అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ANIL) మధ్య ఉమ్మడి ప్రయత్నం. హైడ్రోజన్-శక్తితో నడిచే ట్రక్కుల కోసం ఈ చొరవ అదానీ గ్రూప్ డీకార్బనైజేషన్, బాధ్యతాయుతమైన మైనింగ్ పట్ల నిబద్ధతకు ఒక ముఖ్యమైన అడుగు అని అదానీ ఎంటర్ప్రైజెస్ సీఈఓ డాక్టర్ వినయ్ ప్రకాశ్ అన్నారు. స్థిరమైన మైనింగ్ పద్ధతుల్లో కొత్త ప్రమాణాలకు మార్గదర్శకత్వం వహిస్తూనే అందరికీ సరసమైన, నమ్మదగిన విద్యుత్‌ను నిర్ధారించడం తమ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.