Digital Arrest | న్యూఢిల్లీ, అక్టోబర్ 29: సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో రెచ్చిపోతున్నారు. కొత్తగా ‘డిజిటల్ అరెస్టు’ల పేరుతో జనాన్ని బెదిరిస్తున్నారు. ఆర్బీఐ, సీబీఐ, ఈడీ, కస్టమ్స్, పోలీస్ అధికారులమంటూ అమాయకులను మోసగించి అందినకాడికి డబ్బులు దోచుకుంటున్నారు. దేశంలో ఇలాంటి నేరాలు నానాటికీ పెరుగుతుండటంపై ప్రధాని నరేంద్రమోదీ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా కుంభకోణాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని నిర్దేశిత హెల్ప్లైన్ల ద్వారా తెలియజేయాలని ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో సూచించారు.
మోసగాళ్లు తొలుత ఈడీ, సీబీఐ, ఆర్బీఐ, పోలీస్ అధికారులమని చెప్పుకుంటూ స్కైప్, జూమ్ ద్వారా అమాయకులకు వీడియో కాల్స్ చేస్తారు. మీరు తీవ్రమైన నేరాల్లో భాగమయ్యారని.. పన్ను ఎగవేతలు, ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు మీపై కేసులు నమోదయ్యాయని భయపెడతారు. మనీ లాండరింగ్, స్మగ్లింగ్, డ్రగ్స్ కేసుల్లో మీ పేరు ఉన్నదని, కోర్టు ఆదేశాలతో మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని బెదిరిస్తారు. ఆపై ఎటూ కదలనివ్వకుండా విచారణ జరుపుతున్నట్టు నటిస్తారు.
ఎదుటివాళ్లు నమ్మేలా యూనిఫాంలో కనిపిస్తారు. వారి వెనుక పోలీస్ లేదా సంబంధిత శాఖల లోగోలు కనిపించేలా చూసుకుంటారు. విచారణ చాలా గోప్యంగా జరగాలని, దీని గురించి ఎవరికైనా చెప్తే శిక్ష మరింత పెరుగుతుందని హెచ్చరిస్తారు. ఆ విచారణలో భాగంగా మీ వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలను తీసుకుని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. లేదా ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్తారు. అలా అందినకాడికి దోచుకుంటారు.