న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 : కరోనా మొదటి దశ (2020)లో పలువురు విదేశీయులు ఎటువంటి పత్రాలు లేకుండా అమెరికాలోకి చొరబడ్డారు. అదే మార్గంలో గుజరాత్‌లోని మెహసానా జిల్లా కడీ ప్రాంతానికి చెందిన లాయర్ దంపతులు తమ రెండేండ్ల కుమారుడిని ఇండియాలోనే వదిలేసి అమెరికాలో కాలుపెట్టారు. ఆ తరువాత రెండేండ్లకు వారి బంధువు ఒకరు (అక్రమ మార్గంలో) అమెరికా వస్తుండగా తమ కుమారుడిని కూడా వెంటపెట్టుకొని రమ్మని చెప్పారు. అప్పటికి ఐదేండ్ల వయసున్న బాలుడిని ఆ బంధువు టెక్సాస్ సరిహద్దులో వదిలేసి మాయమైపోయాడు. అమెరికా భద్రతా అధికారికి దొరికిన ఆ బాలుడి జేబులో ఓ చీటీ లభించింది. ఆ చీటీలో బాలుడి తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నంబర్లు ఉన్నాయి. వాటి ఆధారంగా తల్లిదండ్రులను సంప్రదించిన అధికారులు ఆ బాలుడిని వారికి అప్పగించారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఇలా ‘వ్యూహాత్మకంగా వదలిపెట్టడం’ అనే పద్ధతిని అనుసరిస్తున్నారని ఓ అధికారి తెలిపారు. ప్రతి ఏటా పదుల సంఖ్యలో ఇలా మెక్సికో లేదా కెనడా సరిహద్దుల్లో భారతీయుల పిల్లలు అధికారులకు దొరుకుతుంటారని చెప్పారు. అమెరికా కస్టమ్స్, బార్డర్ ప్రొటెక్షన్ నివేదిక ప్రకారం 2022 నుంచి 2025 వరకు 1,656 మంది భారతీయ మైనర్లు అమెరికాలోకి ఇదే పద్ధతిలో ప్రవేశించినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి.
ఈ పిల్లలు వారి తల్లిదండ్రులకు ‘గ్రీన్‌కార్డు’లుగా ఉపయోగపడుతున్నారు. ఇమిగ్రేషన్ నెట్‌వర్క్‌కు చెందిన ఓ అధికారి ఈ విధానాన్ని వివరిస్తూ.. ‘ముందుగా ఏదో ఒక అక్రమ మార్గంలో తల్లిదండ్రులు వచ్చేస్తారు. ఆ తరువాత అదే అక్రమ మార్గంలో వచ్చే ఇతరులతో తమ పిల్లలను తెప్పించుకుంటారు. సరిహద్దుల్లో అధికారులకు ఆ పిల్లలు అనాథలుగా దొరికిపోతారు. మానవతా దృక్పథంతో అధికారులు వారిని శరణార్థులుగా పరిగణించి ఆశ్రయం కల్పిస్తారు. ఆ తరువాత వారు తమ తల్లిదండ్రులను చేరుకుంటారు. కొన్నిసార్లు పిల్లలు ముందుగా వస్తారు. ఆ తరువాత వారిని వెతక్కుంటూ వచ్చినట్టు తల్లిదండ్రులు వచ్చి తమకు కూడా ఆశ్రయం కల్పించాలని దరఖాస్తు చేసుకుంటారు. తమ పిల్లలు ఇప్పటికే అమెరికాలో ఉన్నారని, వారి వద్దకు తమను చేర్చాలని కోరుతారు. ఇలా శరణార్థులుగా వచ్చిన పిల్లలు అమెరికాలో విద్య, వైద్య సదుపాయాలను ఉచితంగా పొందుతారు’ అని ఆ అధికారి వివరించారు. శరణార్థులుగా వచ్చిన బాలలకు అమెరికా జువెనైల్ కోర్టుల రూలింగ్ ప్రకారం ఆరు నుంచి ఎనిమిది నెలల్లో గ్రీన్ కార్డు మంజూరు చేయాల్సి ఉంటుందని ఇమిగ్రేషన్ అధికారి చెప్పారు.