Civils aspirants case : దేశ రాజధాని ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసును సీబీఐ టేకప్ చేయనున్నట్లు సమాచారం. సీబీఐ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
కాగా ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్లో ఇటీవల విషాద ఘటన చోటు చేసుకుంది. రవూస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి భారీగా వరదనీరు చేరడంతో ముగ్గురు విద్యార్థులు నీట మునిగి మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఢిల్లీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోచింగ్ సెంటర్ యజమాని, కోఆర్డినేటర్ సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు.
నిందితులను తీస్ హజారీ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఢిల్లీ పోలీసుల చేతిలో ఉన్న ఈ కేసును ఇప్పుడు సీబీఐకి అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోచింగ్ సెంటర్ సెల్లార్లో వరద నీరు నిండి సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతిచెందారు.