Queen of Jordan | ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో జోర్డాన్ రాజకుటుంబానికి భారత్‌తో ఉన్న అనుబంధం మరోసారి తెరపైకి వచ్చింది. కోల్‌కతాలో పుట్టి.. జోర్డాన్‌కు యువరాణిగా ఎదిగిన ప్రిన్సెస్ సర్వత్ ఎల్ హసన్ అరుదైన గాథ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది
ప్రిన్సెస్ సర్వత్ ఎల్ హసన్ అలియాస్ సర్వత్ ఇక్రాముల్లా 1947లో బ్రిటీష్ ఇండియాలోని కోల్‌కతాలో జన్మించారు. ఆమె తండ్రి మొహమ్మద్ ఇక్రాముల్లా భారతీయ సివిల్ సర్వీస్ అధికారిగా పనిచేశారు. దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఆ దేశ తొలి విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. సర్వత్ తల్లి కూడా రాజకీయ నాయకురాలిగా, దౌత్యవేత్తగా మంచి పేరు సంపాదించుకున్నారు. తల్లిదండ్రుల వృత్తి నేపథ్యంలో సర్వత్ చిన్నతనంలోనే పలు దేశాలు తిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే లండన్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అదే సమయంలో అప్పటి జోర్డాన్ రాకుమారుడు హసన్ బిన్ తలాల్‌తో సర్వత్కు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో 1968లో పాక్‌లోని కరాచీలో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత జోర్డాన్‌కు వెళ్లిన సర్వత్ ఎల్ హసన్ అక్కడి క్రౌన్ ప్రిన్సెస్‌గా బాధ్యతలు చేపట్టారు. 1968 నుంచి 1999 వరకు ఆమె జోర్డాన్ క్రౌన్ ప్రిన్సెస్‌గా కొనసాగారు.
రాకుమారిగా ఉన్నప్పటికీ సర్వత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్య, సామాజిక సేవలతో మంచి పేరు తెచ్చుకున్నారు. అమ్మాన్ బ్యాకలారియేట్ స్కూల్‌ను స్థాపించి పేద ప్రజలకు విద్యను అందించారు. అలాగే ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం పలు విద్యాసంస్థలను కూడా ఆమె ఏర్పాటు చేశారు. మహిళల సాధికారత, సామాజిక అభివృద్ధి రంగాల్లో ఆమె చేసిన సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. జోర్డాన్ దేశంలో తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్ సాధించిన తొలి మహిళగా కూడా సర్వత్ గుర్తింపు పొందారు. 1994లో గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది రినయిసెన్స్ అవార్డు, 1995లో విమెన్ ఆఫ్ పీస్ అవార్డును గెలుచుకున్నారు. 2002లో పాకిస్థాన్ నుంచి హిలాల్ ఈ ఇంతియాజ్ అవార్డు అందుకున్నారు. ఇక 2015లో యూనివర్సిటీ ఆఫ్ బాత్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రౌన్స్విక్ నుంచి గౌరవ డిగ్రీలను అందుకున్నారు. ఏదేమైనా కోల్‌కతాలో జన్మించి జోర్డాన్ రాజకుటుంబంలో కీలక స్థానం దక్కించుకున్న సర్వత్ ఎల్ హసన్ జీవితం ఇప్పుడు భారత్, మధ్య ప్రాచ్య దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోంది.