న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్ధిక వ్యవస్ధ క్రమంగా కోలుకుంటున్న క్రమంలో మరోసారి వైరస్ కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వ్యాప్తితో ఆందోళన నెలకొంది. డిసెంబర్లో భారత్ నిరుద్యోగ రేటు ఏకంగా నాలుగు నెలల గరిష్ట స్ధాయికి ఎగబాకిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది నవంబర్‌లో 7 శాతంగా నమోదైన నిరుద్యోగ రేటు డిసెంబర్లో 7.9 శాతానికి పెరిగింది. ఇది ఆగస్ట్‌లో నమోదైన 8.3 శాతం తర్వాత మరోసారి ఆ స్ధాయిలో పెరిగింది.
అంతకుముదు నెల నవంబర్‌లో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 8.2 శాతం కాగా డిసెంబర్లో అది 9.3 శాతానికి ఎగబాకింది. ఇక గ్రామీణ నిరుద్యోగ రేటు 6.4 శాతం నుంచి 7.3 శాతానికి పెరిగిందని గణాంకాలు వెల్లడించాయి. ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు కఠినతరం కావడం, పెద్ద ఎత్తున నియంత్రణలు చేపడుతుండటంతో నిరుద్యోగ రేటు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందనే ఆందోళన నెలకొంది.