India Longest Railway Platform | భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థ. ఆర్థికంగా, భద్రతను దృష్టిలో పెట్టుకొని నిత్యం లక్షలాది మంది రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ప్రయాణీకుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి భారతీయ రైల్వేలు అనేక నియమ నిబంధనలు రూపొందించింది. అలాగే, భారతీయ రైల్వేలు దేశంలోని లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్నది. భారతీయ రైల్వే ఇటీవలకాలంలో పెద్ద ఎత్తున రైల్వేస్టేషన్లను పునరుద్ధరిస్తున్నది. అదే సమయంలో రైళ్లను సైతం ఆధునికీకరిస్తున్నది. దేశంలోని అనేక రైల్వే స్టేషన్లకు పునరుజ్జీవం పోస్తున్నది. రైలు ప్రయాణంలో అనేక స్టేషన్లలో నుంచి వెళ్తుంటాం. రైలు ఆగే స్టేషన్లలో కొన్ని చాలా పొడవైన ప్లాట్‌ఫామ్స్ కనిపిస్తాయి. చాలామందికి దేశంలో అతిపొడవైన రైల్వేప్లాట్ఫామ్ ఎక్కడ ఉందో తెలియదు. అది ఎక్కడ ఎందుతో తెలుసుకుందాం రండి..!
భారత్‌లోనే అతిపొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్ కర్ణాటకలోని హుబ్లి రైల్వేస్టేషన్లో ఉంది. ఈ రైల్వే ప్లాట్‌ఫామ్ భారత్‌లోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌గా నిలిచింది. దీని మొత్తం పొడవు 1507 మీటర్లు. ఈ ప్లాట్‌ఫారమ్ దాదాపు 1.5 కిలోమీటర్లు కావడం విశేషం. ఈ రైల్వే స్టేషన్‌ను నిర్మించడానికి దాదాపు రూ. 20.1 కోట్లు ఖర్చు చేశారు. ఈ రైల్వే స్టేషన్ కర్ణాటకలోని కీలకమైన రైల్వే స్టేషన్లలో ఒకటి. హుబ్లీ కంటే ముందు.. భారతదేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్ గోరఖ్‌పూర్‌లో ఉండేది. హుబ్లీ రైల్వే స్టేషన్లో ఉన్న పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను 2023 సంవత్సరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైల్వే ప్లాట్‌ఫారమ్ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. కర్ణాటకలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ పూర్తి పేరు సిద్ధారుధ స్వామిజీ హుబ్లీ స్టేషన్. ఇక రైల్వేస్టేషన్ ప్రజా రవాణా, సరుకు రవాణాకు కేంద్రంగా ఉంది. బెంగళూరు తర్వాత కర్నాటకలో అత్యంత రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ ఇదే.
ఈ స్టేషన్ బెంగళూరు, మైసూరు, మంగళూరు, హైదరాబాద్, ముంబయి, న్యూఢిల్లీ, చెన్నై, తిరువనంతరపురం, గోవా తదితర నగరాలను కలుపుతుంది. ప్రజ రవాణాతో పాటు మాంగనీస్ వంటి సరుకు రవాణాకు ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. హుబ్లీ రైల్వే డివిజన్ కింద గూడ్స్ షెడ్, డీజిల్ లోకో షెడ్, క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, ట్రైన్ యార్డ్ ఉన్నాయి. ఈ స్టేషన్లో 19వ శతాబ్దం చివరలో అంటే 1886-87లో బ్రిటీష్ కంపెనీ ప్రారంభించింది. ప్రస్తుతం పురాతన రైల్వేస్టేషన్లలో ఒకటి. అప్పటి నుంచే ఈ రైల్వేస్టేషన్ ప్రజా రవాణా, సరుకు రవాణాకు కీలకమైన మార్గంగా నిలిచింది. భారతదేశంలోని దాదాపు ప్రతి ప్రాంతానికి, బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, ముంబయి, పూణే, అహ్మదాబాద్, ఉదయపూర్, న్యూఢిల్లీ, వారణాసి, కోల్‌కతా, హైదరాబాద్, విశాఖపట్నం, మడ్గావ్-వాస్కో-గోవా, అనేక ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ ఉన్నది.