Vande Bharat Sleeper | భారతీయ రైల్వేశాఖ ఎప్పటికప్పుడు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఈ సెమీ హెస్పీడ్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య దూసుకెళ్లనున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలోనే కొత్తగా వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం.. 2025-26 మధ్య నాటికి భారత్‌లో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ప్రపంచస్థాయి సౌకర్యాలు, అత్యాధునిక డిజైన్‌తో తీర్చిదిద్దిన ఈ రైళ్లు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకురాబోతున్నది.
ఓ నివేదిక ప్రకారం.. భారతీయ రైల్వే.. 2025-26 నాటికి పది వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. భారతదేశపు తొలి వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ తర్వాత 2025లో ప్రారంభించే అవకాశం ఉన్నది. చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) జనరల్ మేనేజర్ సుబ్బారావు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నవంబర్ 15 నుంచి రెండునెలల పాటు రైళ్ల ఆసిలేషన్ ట్రయల్స్‌తో పాటు ఇతర పరీక్షలు నిర్వహిస్తామని.. ఆ తర్వాత కమర్షియల్ సర్వీస్‌లోకి తీసుకువస్తామని తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రయాణీకుల భద్రత, సౌకర్యానికి ప్రాధాన్యతనిచ్చేలా రైల్వేశాఖ తీర్చిదిద్దింది.
ఈ రైళ్లు ఆస్తెనిటిక్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారయ్యాయి. క్రాష్ బఫర్, ప్రత్యేకంగా రూపొందించిన కప్లర్ల వంటి అధునాతన భద్రతా పరికరాలతో అమర్చబడి ఉండనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా ఉండేలా సామర్థ్యం ఉంటుంది. ఈ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. 823 మంది ప్రయాణికులు ఈ రైలు ప్రయాణించేందుకు వీలుంటుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైలు నడిచే మార్గాలను ఇంకా ఖరారు చేయలేదు. అయితే, న్యూఢిల్లీ – పూణే, న్యూఢిల్లీ – శ్రీనగర్ తదితర మార్గాల్లో నడిపేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తున్నది.