న్యూఢిల్లీ : రైలు టికెట్లను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునేవారు ఇకపై కన్వీనియెన్స్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. నాన్ ఏసీ టికెట్కు రూ.10 ప్లస్ జీఎస్టీ, ఏసీ టికెట్కు రూ.20 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. దీనివల్ల ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ నిర్వహణ సక్రమంగా, సజావుగా జరుగుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.
ఈ రోజుల్లో దాదాపు 87 శాతం మంది ప్రయాణికులు రిజర్వుడు టికెట్లను ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నారు. దీనివల్ల సమయం ఆదా అవడంతోపాటు చాంతాడంత వరుసలలో బారులు తీరి ఉండాల్సిన అవసరం తప్పుతున్నది. ఈ కన్వీనియెన్స్ ఛార్జి యూపీఐ చెల్లింపులతో పాటు అన్ని రకాల చెల్లింపు విధానాలకు వర్తిస్తుంది.