Indian Railways | న్యూఢిల్లీ, జూలై 1: రైల్వే సేవల కోసం నానా రకాల యాప్‌లను ఉపయోగించలేక, వాటి లాగిన్, పాస్వర్డ్ వివరాలను గుర్తుపెట్టుకోలేక సతమతమవుతున్నారా? అయితే, ఈ ఇబ్బందులకు రైల్వే శాఖ తెరదించింది. భారతీయ రైల్వేలకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే ‘రైల్‌వన్’ సూపర్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని సాయంతో రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ టికెట్లతోపాటు ప్లాట్‌ఫామ్ టికెట్లు, రైళ్ల రాకపోకల వివరాలు, పీఎన్ఆర్, జర్నీ ప్లానింగ్, రైల్ మదద్, ఫుడ్ ఆన్ ట్రైన్ తదితర సేవలను పొందవచ్చు. ప్రస్తుతం ‘రైల్‌వన్’ యాప్‌లో అందుబాటులో ఉన్న సేవలన్నీ ఇప్పటివరకు ఆన్లైన్, యాప్‌ల ద్వారా వేర్వేరుగా అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సేవకు ఒక్కో యాప్ ఉన్నది.
ఆన్లైన్లో రిజర్వ్డ్ క్లాస్ టికెట్ల బుకింగ్ కోసం ‘ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్’ యాప్‌ను, అన్ రిజర్వ్డ్ టికెట్ల కోసం ‘యూటీఎస్’ యాప్‌ను, ఫిర్యాదుల దాఖలు లేదా సహాయం కోసం ‘రైల్ మదద్’ యాప్‌ను, రైళ్ల రాకపోకల వివరాలను తెలుసుకునేందుకు ‘ఎన్టీఈఎస్’ (నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్) యాప్‌ను ఉపయోగించాల్సి వస్తున్నది. ఈ సేవలన్నింటినీ ఒకే చోట అందించడమే ‘రైల్‌వన్’ యాప్ లక్ష్యం.
తొలుత ‘స్వరైల్’ పేరుతో ఈ సూపర్ యాప్‌ను పరిశీలించిన రైల్వే శాఖ.. తాజాగా ‘రైల్‌వన్’ పేరుతో పౌరులందరికీ అందుబాటులోకి తెచ్చింది. దీన్ని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేసింది. సీఆర్ఐఎస్ 40వ వార్షికోత్సవం సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ‘రైల్‌వన్’ యాప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ యాప్ హిందీ, ఇంగ్లిష్ భాషలను సపోర్ట్ చేస్తుంది. ‘రైల్‌వన్’ యాప్ ద్వారా మున్ముందు మరిన్ని సేవలు అందించే అవకాశం ఉన్నది.