Indian Railway | సరిహద్దుల్లో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. జమ్మూ, ఉదంపూర్ నుంచి మూడు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. భద్రతా సమస్యలు పెరిగిన నేపథ్యంలో ప్రజల డిమాండ్ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 12 అన్రిజర్వ్డ్, 12 రిజర్వ్డ్ కోచ్‌లతో కూడిన 04612 నంబరు గల రైలు ఉదయం 10.45 గంటలకు జమ్మూ నుంచి బయలుదేరుతుంది. వందే భారత్ రైలు 12.45 గంటలకు ఉదంపూర్ నుంచి బయలుదేరి జమ్మూ, పఠాన్‌కోఠ్ మీదుగా ఢిల్లీకి చేరుకుంటుందని చెప్పింది.
పూర్తిగా రిజర్వ్ చేసిన ప్రత్యేక రైలు కూడా సాయంత్రం 7 గంటలకు జమ్మూ నుంచి బయలుదేరుతుందని రైల్వే తెలిపింది. రాత్రి 7 గంటలకు మరో 22 కోచ్‌లతో కూడిన రిజర్వ్డ్ ట్రైన్ ఢిల్లీకి బయలుదేరుతుందని వివరించింది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జమ్మూ, ఉదంపూర్ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లను నడపాలని భారత రైల్వే నిర్ణయించిందని రైల్వేస్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఏపీలోని నెల్లూరు రైల్వేస్టేషన్లో పోలీసులు డాగ్‌స్క్వాడ్స్, జీఆర్పీ బృందం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఏపీ డీజీపీ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. స్థానిక ఇన్స్పెక్టర్, ముగ్గురు టౌన్ ఇన్స్పెక్టర్లు, జీపీఆర్, ఆర్పీఎఫ్, దాదాపు వంద మంది పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేశారు. ప్లాట్‌ఫారమ్, స్టేషన్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల స్టేషన్లలోనూ తనిఖీలు జరిపినట్లు చెప్పారు.