Indian Railway | ప్రయాణికులకు భారతీయ రైల్వే బోర్డు శుభవార్త చెప్పింది. వందే భారత్ సహా పలు రైళ్లలోని ఏసీ చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ప్రయాణించే వారికి భారీ ఉపశమనం కలుగనున్నది. వందే భారత్ సహా అన్ని రైళ్లలో ఏసీ చైర్ర్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీలను 25శాతం వరకు తగ్గించనున్నట్లు బోర్డు పేర్కొంది. గత 30 రోజుల్లో 50శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో రాయితీ ఛార్జీల పథకాన్ని ప్రవేశపెట్టాలని రైల్వే బోర్డు జోన్లకు బోర్డు సూచించింది. ప్రాథమిక ఛార్జీపై గరిష్ఠంగా 25శాతం వరకు తగ్గింపు ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇతర ఛార్జీలు విధింపు ఉంటుందని పేర్కొంది. ఈ తగ్గింపు తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. అయితే, ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఛార్జీల తగ్గింపు నేపథ్యంలో వాపస్ ఇవ్వబడదని స్పష్టం చేసింది.
సెలవులు, పండుగ సమయంలో ప్రత్యేక రైళ్లలో ఈ పథకం వర్తించదని చెప్పింది. ఏసీ సిట్టింగ్ వసతి ఉన్న రైళ్లలో రాయితీ ఛార్జీల పథకాన్ని ప్రవేశపెట్టడానికి జోనల్ రైల్వేలకు అధికారాలను అప్పగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. విస్టాడోమ్ కోచ్‌లతో సహా ఏసీ సౌకర్యం ఉన్న అన్ని రైళ్లలోని ఏసీ చైర్కాన్, ఎగ్జిక్యూటివ్ తరగతులకు ఈ పథకం వర్తించనున్నది. రాయితీ ప్రైమరీ ఛార్జీపై గరిష్ఠంగా 25శాతం వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీ, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీ, జీఎస్టీ తదితర ఛార్జీలు అదనంగా ఉంటాయి. తత్కాల్ కోటాపై రాయితీ ఉండదని, ఫస్ట్ చార్ట్ ప్రకటించే వరకు, కరెంట్ బుకింగ్ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లకు తగ్గింపు ఉంటుందని పేర్కొంది. ఆన్‌బోర్డ్‌లో టీటీఈ ద్వారా జారీ చేసే టికెట్‌పై సైతం డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది.