న్యూఢిల్లీ, ఆగస్టు 21: ద్వైపాక్షిక సంబంధాల్ని మెరుగుపర్చుకునేందుకు పోలండ్ బయల్దేరిన ప్రధాని మోదీ బుధవారం రాజధాని వార్సా చేరుకున్నారు. ఇక్కడి మిలటరీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ‘పోలండ్‌లో దిగాను. ఇక్కడ వివిధ కార్యక్రమాల కోసం ఎదురుచూస్తున్నా. ఈ పర్యటన ఇరు దేశాల స్నేహానికి ఊపునిస్తుంది. ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది’ అంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. యూరప్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పోలండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటిస్తున్నారు. దాదాపు 45 ఏండ్ల తర్వాత..మళ్లీ ఇన్నేండ్లకు భారత ప్రధాని పోలండ్‌లో పర్యటిస్తున్నారు. భారత్-పోలండ్ ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 70 ఏండ్లు అవుతున్న సందర్భంగా, ఇరు దేశాల నేతల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఆగస్టు 23న ప్రధాని మోదీ ట్రెయిన్ ఫోర్స్ వన్’లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు వెళ్లటం ఇదే తొలిసారి.
భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన
న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఎస్సీ, ఎస్టీ కులాల ఉప వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దళిత, ఆదివాసీ సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. బీహార్, జార్ఖండ్ రాష్ర్టాల్లో బంద్ ప్రభావం అధికంగా కనిపించింది. ఇక రాజస్థాన్, పంజాబ్, హర్యానా, అస్సాంలలో బంద్ ప్రభావం కన్పించ లేదు. బంద్‌కు మద్దతు తెలిపిన ఎన్డీయేతర రాష్ర్టాలు, ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో బంద్ ప్రభావం స్వల్పంగా కన్పించింది. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశంలోని 21 సంస్థలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. బీహార్‌లోని పలు ప్రాంతాల్లో రైళ్లు, రోడ్ మార్గాలకు ఆందోళనకారులు ఆటంకాలు కల్పించారు. షాపులను మూసివేయించి, రోడ్లపై టైర్లను కాల్చారు. అయితే పోలీసులు వారిపై లాఠీలు, వాటర్ కెనాన్లను ప్రయోగించి చెదరగొట్టారు. ఆందోళనల ఫలితంగా దర్భంగ, బక్సర్‌లలో రైళ్ల సర్వీసులకు ఆటంకం కలిగింది. పాట్నా, హజీపూర్, దర్భంగ, జెహనాబాద్, బెగూసరాయ్ జిల్లాల్లో పలు చోట్ల రోడ్లను దిగ్బంధించారు. జార్ఖండ్‌లో రోడ్లపై బస్సులు తిరగలేదు. స్కూళ్లు పనిచేయలేదు. బంద్‌కు అధికార జేఎంఎం సహా వామపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.