ముంబై, ఫిబ్రవరి 22: తన తండ్రికి చెందిన మాజీ ఉద్యోగిని అపహరించి, హత్య చేశారన్న ఆరోపణలపై ఉగాండాలో అరస్టై మూడు వారాలు జైలుపాలైన భారతీయ సంతతి సంపన్న వ్యాపారవేత్త పంకజ్ ఓస్వాల్ కూతురు వసుంధరా ఓస్వాల్ ఉగాండాలోని జైలులో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. పంకజ్ ఓస్వాల్ వద్ద గతంలో పనిచేసిన ముకేష్ మేనరియాను అపహరించి, హత్య చేసినట్టు వసుంధరా ఓస్వాల్(26)పై నిరుడు తప్పుడు ఆరోపణలు నమోదయ్యాయి.
అయితే ముకేష్ టాంజానియాలో సజీవంగా ఉన్నట్టు తర్వాత బయటపడింది. తనను ఐదు రోజులు పోలీసు కస్టడీలోకి తీసుకుని ఆ తర్వాత రెండు వారాలు జైలులో పడేశారని శుక్రవారం ఆమె విలేకరులకు వివరించారు. జైలులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని, తనకు స్నానం చేసేందుకు అనుమతి ఇవ్వలేదని, కనీసం ఆహారం, మంచినీరు ఇవ్వలేదని ఆమె చెప్పారు. ఆహారం, మంచినీరు, ఇతర అవసరాలను తనకు అందచేసేందుకు తన తల్లిదండ్రులు పోలీసు అధికారులకు లంచం ముట్టచెప్పాల్సి వచ్చిందని వసుంధర వాపోయారు. ఒక దశలో తాను వాష్రూముకు వెళ్లడానికి కూడా అనుమతించలేదన్నారు.