Supreme Court : యెమెన్ (Yemen) లో మరణశిక్ష (Death sentence) ను ఎదుర్కొంటున్న భారత నర్సు నిమిష ప్రియకు శిక్ష అమలుపై స్టే కొనసాగుతున్నదని గురువారం కేంద్ర ప్రభుత్వం (Union Govt) సుప్రీంకోర్టు (Supreme Court) కు తెలియజేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకోకపోవడం గమనార్హమని పేర్కొంది.
భారతీయ నర్సు నిమిష ప్రియను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం దౌత్యమార్గాలను ఉపయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. తాజాగా ఆ మరణశిక్ష గురించి ప్రశ్నించింది. ఆమెకు చట్టపరమైన సహకారం అందిస్తున్న ‘సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. శిక్ష అమలుపై స్టే కొనసాగుతోందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వెంకటరమణి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ కేసులోకి కొత్త మధ్యవర్తి వచ్చారని, ఇప్పటివరకు ఈ కేసులో తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకోకపోవడం మంచి విషయమని అన్నారు. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం కేసును జనవరికి వాయిదా వేసింది. అయితే ఏవైనా అత్యవసర పరిస్థితులు ఉంటే ముందస్తు లిస్టింగ్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
కాగా నిమిష ప్రియ నర్సింగ్ కోర్సు పూర్తిచేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరారు. ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి తలాల్ అదిబ్ మెహది భాగస్వామ్యంతో అల్‌అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. తర్వాత ఆ వ్యక్తి ప్రియను వేధించి, పాస్‌పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. 2016లో అతడిపై ప్రియ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
కానీ, వారు ఆమెను పట్టించుకోలేదు. దాంతో 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ ఆ డోస్ ఎక్కువకావడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్‌లో పారేసింది. చివరికి అక్కడినుంచి సౌదీకి వెళ్లిపోతుండగా సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేసి మరణశిక్ష విధించారు. భారత ప్రభుత్వం, మత పెద్దల ప్రయత్నాలతో ప్రస్తుతం ఆమె ఉరిశిక్ష స్టే కొనసాగుతోంది.