న్యూఢిల్లీ: సముద్ర మార్గాల ద్వారా ఓడల్లో అక్రమంగా జరుగుతున్న డ్రగ్స్ రవాణాపై భారత నౌకాదళం దృష్టిసారించింది. అనుమానాస్పద నౌకలను తనిఖీ చేసింది. ఒక షిప్ నుంచి 2,500 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నది. (Navy Seizes Narcotics ) భారత నావికాదళానికి చెందిన ఫ్రంట్‌లైన్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తార్కాష్ యుద్ధ నౌక ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించింది. మార్చి 31న పశ్చిమ హిందూ మహాసముద్రంలో కొన్ని నౌకల అనుమానాస్పద కదలికలపై ఇండియన్ నేవీకి సమాచారం అందింది.
కాగా, యుద్ధ నౌక ఐఎన్ఎస్ తార్కాష్ ను రంగంలోకి దించారు. పీ81 సముద్ర నిఘా విమానం, ముంబైలోని మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్‌తో సమన్వయంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అనుమానాస్పద నౌకలను తనిఖీ చేశారు. ఒక షిప్‌ను అడ్డగించారు. తార్కాష్ యుద్ధ నౌకలోని హెలికాప్టర్ ద్వారా మెరైన్ కమాండోలు, స్పెషలిస్ట్ బోర్డింగ్ బృందాలు ఆ షిప్‌లోకి చేరుకున్నాయి. దాని సిబ్బందిని ప్రశ్నించారు.
మరోవైపు ఆ షిప్‌లోని కార్గో కంపార్ట్మెంట్లను మెరైన్ కమాండోలు చెక్ చేశారు. దీంతో 2,386 కిలోల హషీష్, 121 కిలోల హెరాయిన్‌తో సహా2,500 కిలోల మత్తు పదార్థాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఆ ఓడను ఐఎన్ఎస్ తార్కాష్ నియంత్రణలోకి తీసుకువచ్చినట్లు నేవీ అధికారులు తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా, ఇలాంటి ఇతర నౌకల గురించి ఆ షిప్ సిబ్బందిని సమగ్రంగా ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.