న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: పాక్తో ఉద్రిక్తతల వేళ భారత నేవీ కూడా అప్రమత్తమైంది. తాజాగా గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎస్ఎస్ సూరత్ తొలిసారిగా గగనతలంలో వస్తున్న సీ స్కిమ్మింగ్ టార్గెట్ను అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. 70 కిలోమీటర్ల రేంజ్లో లక్ష్యాన్ని కూల్చేసింది. ఈ మేరకు నౌకాదళం ఓ వీడియోను విడుదల చేసింది.
సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లను, క్షిపణులను సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పిలుస్తారు. మరోవైపు, అరేబియా సముద్రంలో విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తన గస్తీని మొదలుపెట్టింది. కర్ణాటకలోని కార్వార్ పోర్టు సమీపంలో విక్రాంత్ గస్తీని ముమ్మరం చేసినట్టు ఉపగ్రహ ఛాయా చిత్రాలను బట్టి తెలుస్తున్నది. పహల్గాం దాడి నేపథ్యంలోనే నేవీ యుద్ధ నౌకలను మోహరించినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.