పనాజీ: ఇండియన్ నేవీకి చెందిన సబ్‌మెరైన్ ఒక ఫిషింగ్ బోట్‌ను ఢీకొట్టింది. (Submarine Collides With Boat) ఈ సంఘటనలో ఆ బోటులో ఉన్న మత్స్యకారుల్లో కొందరు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు, కోస్ట్‌గార్డ్ బోట్లు, విమానంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. మార్తోమా అనే ఫిషింగ్ బోట్‌ను ఇండియన్ నేవీకి చెందిన స్కార్పెన్-క్లాస్ సబ్‌మెరైన్ ఢీకొట్టింది. దీంతో 13 మంది మత్స్యకారులున్న ఆ బోటు బోల్తా పడింది. 11 మంది మత్స్యకారులను రక్షించగా ఇద్దరు గల్లంతయ్యారు.
కాగా, భారత నౌకాదళానికి చెందిన ఆరు వార్ షిప్‌లు, కోస్ట్‌గార్డ్ బోట్లు, విమానంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సముద్రంలో గల్లంతైన ఇద్దరు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌తో సమన్వయం చేసుకుని అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సంఘటనలో సబ్‌మెరైన్‌కు స్వల్పంగా డేమేజ్ కలిగినట్లు పేర్కొంది.