న్యూఢిల్లీ : భారత నౌకాదళానికి చెందిన ‘దృష్టి-10’ మానవరహిత విమానం(యూఏవీ/డ్రోన్) గుజరాత్‌లోని పోర్బందర్ సమీపంలో బుధవారం కూలిపోయింది. శిక్షణ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని నౌకాదళ అధికారులు తెలిపారు.
ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ‘ఎక్స్’ వేదికగా నౌకాదళ ప్రతినిధి వెల్లడించారు. నౌకాదళం పర్యవేక్షణ అవసరాల కోసం వినియోగించే ‘దృష్టి-10 డ్రోన్’కు ఇజ్రాయెల్‌కు చెందిన ‘ఎల్బిట్ సిస్టమ్’ భాగస్వామ్యంతో ‘అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్’ సంస్థ రూపకల్పన చేసింది.