న్యూఢిల్లీ: హొర్ముజ్ జలసంధి మీదుగా యూఏఈ పతాకంతో వస్తున్న రెండు చమురు ట్యాంకర్లపై మంగళవారం క్రూయిజ్ క్షిపణులతో ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. ఆరుగురు భారతీయులు సహా 8 మంది ఈ ఘటనల్లో గాయపడ్డారు. ఈ చర్యను భారత్ తీవ్రంగా గర్హించింది. న్యూఢిల్లీలోని ఇరాన్ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది. యూఏఈ రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. తమ దేశానికి చెందిన రెండు చమురు ట్యాంకర్లు మొంబాస, అల్ బహియాలు ఒమన్ ప్రాదేశిక జలాల పరిధిలోని హొర్ముజ్ జలసంధి దక్షిణ నౌకాయాన మార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఇరాన్.. క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడిలో మొంబాసలో సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుడొకరు మరణించాడు.
మరో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయినియన్లు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడితో రెండు నౌకలు నిప్పంటుకోవడంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాగా, భారత నావికుడు మృతిపై సమాచారం అందిందని, పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తున్నామని, భారత దౌత్యకార్యాలయం ప్రకటించింది. గాయపడ్డ నావికుల కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందజేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. ఈ ఘటనతో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మహ్మద్ జావెద్ హొస్సెనీతో పాటు ఇరాన్ దౌత్యవేత్తలను ఢిల్లీలోని విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.
ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు ఇరాన్-అమెరికా యుద్ధంలో 13 మంది భారతీయులు మృతి చెందారని, ముగ్గురు గల్లంతయ్యారని విదేశాంగ శాఖ వర్గాలు మంగళవారం తెలిపాయి. పరిస్థితిని భారత్ నిశితంగా పరిశీలిస్తున్నదని..హొర్ముజ్ జల సంధిలో సురక్షితమైన, ఆటంకాలు లేని నౌకాయానం కొనసాగాలని పిలుపునిచ్చింది. ఈ వారపు మీడియా సమావేశంలో విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ తాజాగా రెండు భారత వాణిజ్య నౌకలపై దాడి జరిగి ఒక భారత నావికుడు చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.