ఢిల్లీ : ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న వైరస్‌ను అదుపులోకి తేవాలంటే ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న 10 నుండి 15 రోజుల లాక్డౌన్ కాకుండా దేశవ్యాప్త లాక్డౌన్ అవసరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కేంద్రానికి సూచించింది. దేశంలో కరోనా కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ పెట్టాలని ఐఎంఏ కేంద్రాన్ని కోరింది. దీనివల్ల వైరస్ చైన్‌ను బ్రేక్ చేయడంతో పాటు కొవిడ్ రోగులకు నిరంతరాయంగా సేవలందిస్తున్న మెడికల్ సిబ్బందికి కొంత ఉపశమనం లభిస్తుందంది.
కొవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా తలెత్తిన సంక్షోభం నుండి బయటపడేందుకు ఇప్పటికైనా మేల్కోవాలంటూ ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖకు ఐఎంఏ లేఖ రాసింది. రాత్రి పూట కర్ఫ్యూలు విధించడం వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేదంది. ఆర్థిక పరిస్థితుల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమంది.
కేంద్రం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియను తప్పుపట్టిన ఐఎంఏ ముందుచూపు లేకపోవడం వల్లే చాలాచోట్ల ఇప్పటికీ 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ అందించే పరిస్థితులు లేవంది. మసూచి వంటి వ్యాధులకు సార్వత్రిక టీకా అందించిన కేంద్రం ఇప్పుడెందుకు వేర్వేరు ధరలకు టీకాలను అందజేయాల్సి వస్తుందని ప్రశ్నించింది. ఆక్సిజన్ కొరత, వైద్యులు వైరస్ బారినపడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజావైద్యానికి జీడీపీలో 8 శాతం మేర కేటాయింపులు జరపాలని సూచించింది.
#PMOIndia #NITIAayog #LargestVaccineDrive #IMAIndiaOrg IMA demands the health ministry wake up from its slumber and responds to mitigate the growing challenges of the pandemic. pic.twitter.com/7OxKgLhi9Q
— Indian Medical Association (@IMAIndiaOrg) May 8, 2021