Pakistan | న్యూఢిల్లీ, మే 5: తన వస్తువులను మన మార్కెట్లో విక్రయించేందుకు పాకిస్థాన్ కుటిల యత్నాలు చేస్తున్నది. మరో దేశం మీదుగా వాటిని భారత్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నది. పహల్గాం దాడి తర్వాత పాక్ నుంచి వచ్చే దిగుమతులు అన్నింటిపైనా భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా ఉత్పత్తులను ఎలాగైనా మన మార్కెట్లోకి పంపించేందుకు దాయాది దేశం అడ్డదారులు వెదుకుతున్నది.
యూఏఈ, సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక మీదుగా వాటిని భారత్లోకి పంపించాలని వ్యూహాలు పన్నుతున్నది. దీంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు 500 మిలియన్ డాలర్ల విలువైన పాకిస్థానీ పండ్లు, ఎండు ఖర్జూరాలు, టెక్స్టైల్స్, రాతి ఉప్పు, తోలు వస్తువులు తదితర ఉత్పత్తులను ఇతర దేశాల్లో లేబుల్స్ మార్చి, రీ-ప్యాకేజ్ చేస్తున్నట్టు సమాచారం ఉందని వార్తలు వెలువడ్డాయి. అక్కడి నుంచి వాటిని భారత మార్కెట్లోకి ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.