వాషింగ్టన్: అమెరికా స్టోర్‌లో ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. అక్కడ పని చేస్తున్న భారతీయ వ్యక్తి, అతడి కుమార్తె ఈ కాల్పుల్లో మరణించారు. (Indian Man, Daughter Killed In US) నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వర్జీనియాలోని అకామాక్ కౌంటీలో ఈ సంఘటన జరిగింది. 56 ఏళ్ల ప్రదీప్ పటేల్, ఆయన 24 ఏళ్ల కుమార్తె ఉర్మి తమ బంధువులకు చెందిన స్టోర్‌లో పని చేస్తున్నారు. గురువారం ఉదయం వారు ఆ స్టోర్‌ను తెరిచారు. ఒక వ్యక్తి మద్యం కొనేందుకు అక్కడకు వచ్చాడు.
కాగా, రాత్రి పూట ఆ స్టోర్‌ను ఎందుకు మూసి ఉంచారంటూ ఆ వ్యక్తి ఆగ్రహించాడు. గన్ తీసి తండ్రీ కుమార్తెలపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ప్రదీప్ పటేల్ అక్కడికక్కడే మరణించారు. కుమార్తె ఉర్మిని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు వెంటనే ఆ స్టోర్ వద్దకు చేరుకున్నారు. నిందితుడైన 44 ఏళ్ల జార్జ్ ఫ్రేజియర్ డెవాన్ వార్టన్‌ను అరెస్ట్ చేశారు.
మరోవైపు గుజరాత్‌కు చెందిన ప్రదీప్ పటేల్ కుటుంబం ఆరేళ్ల కిందట అమెరికా వచ్చింది. తమ బంధువైన పరేష్ పటేల్‌కు చెందిన స్టోర్‌లో ప్రదీప్ ఆయన కుమార్తె ఉర్మి పని చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రదీప్ పటేల్‌కు మరో ఇద్దరు కుమార్తెలున్నట్లు బంధువులు తెలిపారు. ఒకరు కెనడాలో, మరొకరు అహ్మదాబాద్‌లో నివసిస్తున్నట్లు చెప్పారు.