Vikram Misri | ఢిల్లీ, మే 10: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలపై దీటుగా జవాబిస్తామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణను ఉల్లంఘించడాన్ని, మళ్లీ షెల్లింగ్‌ను ప్రారంభించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చామని, సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని తెలిపారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
‘డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనా ఒప్పందాన్ని పాక్ పదేపదే ఉల్లంఘిస్తున్నది. గత కొన్ని గంటలుగా అంతర్జాతీయ సరిహద్దుతో పాటు ఎల్వోసీ వద్ద పదేపదే పాక్ కాల్పులు జరుపుతున్నది. ఈ విషయాన్ని భారత్ చాలా సీరియస్‌గా తీసుకుంటున్నది. దీనిపై భారత్ దీటుగా స్పందిస్తుంది. ఈ ఉల్లంఘనలను నిలువరించే సం పూర్ణ అధికారం భారత్‌కు ఉంది. అందుకు సంబంధించి ఆదేశాలు సైన్యానికి అందాయి. ఈ విషయం లో పాక్ బాధ్యతాయుతంగా, సీరియస్‌గా వ్యవహరించాలి. ఉల్లంఘన సరికాదు. ఈ కాల్పులను పాక్ నిలువరిస్తుందని ఆశిస్తున్నా’ అని మిస్రీ తెలిపారు.
పాక్ దాడులను తిప్పికొట్టాం విదేశాంగ కార్యదర్శి మిస్రీ వెల్లడి
న్యూఢిల్లీ, మే 10: పాకిస్థాన్ శనివారం జరిపిన దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. భారత్-పాక్ ఉద్రిక్తతలపై సైన్యానికి చెందిన కర్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. పశ్చిమ ప్రాంతం వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలపై డ్రోన్లు, దూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, జెట్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించిందని విక్రమ్ మిస్రీ తెలిపారు. అయితే వాటిని భారత్ తిప్పికొట్టిందని చెప్పారు. పంజాబ్, జమ్ము కశ్మీరులోని పౌరులను, పౌరుల మౌలిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు కొనసాగించినట్లు మిస్రీ చెప్పారు. భారతీయ క్షిపణులు అఫ్గానిస్థాన్‌కు తాకాయంటూ పాక్ చేసిన ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. శ్రీనగర్, అవంతిపురా, ఉధంపూర్‌లోని వైద్య సౌకర్యాలపై పాకిస్థాన్ దాడులు చేసిందని కర్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. పంజాబ్‌లోకి హైస్పీడ్ క్షిపణిని పాకిస్థాన్ ప్రయోగించిందని, అయితే పాకిస్థానీ చర్యలకు భారత్ దీటుగా సమాధానం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. పాక్ దాడులకు ప్రతిగా ఆ దేశంలోని మిలిటరీ స్థావరాలు, రాడార్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లపై దాడులు చేసినట్టు వ్యోమికాసింగ్ చెప్పారు.