‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్’పై భారత ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. ఇస్లామాబాద్‌లో జరిగే ఓఐసీ సమావేశానికి ‘ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్’ అధ్యక్షుడికి ఆహ్వానం పంపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత వ్యతిరేక, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న వారిని ఈ సమావేశానికి ఎలా పిలుస్తారని, వారిని ఎలా ప్రోత్సహిస్తారని భారత ప్రభుత్వం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్‌ను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ సూటిగా ప్రశ్నించారు.
ఈ నెల 22, 23 తేదీల్లో ఇస్లామాబాద్ వేదికగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశానికి ఓఐసీ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడ్ని ఆహ్వానించింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, ఐక్యతా చర్యలకు భంగం కలిగించే చర్యలను తాము సీరియస్‌గా తీసుకుంటామని భారత్ హెచ్చరించింది.