అమెరికా మాటలు వినకుండా, తన శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా, భారత హెచ్చరికలను పట్టించుకోకుండా దుస్సాహసానికి దిగిన పాక్‌కు వెన్నువిరిగినంత పనైంది. బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి దాకా రెండు సార్లు భారత్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే రెండు సార్లూ శృంగభంగమైంది. పాక్‌కు చెందిన మూడు యుద్ధ విమానాలను, పదుల సంఖ్యలో మిసైళ్లను, వందలాది డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. ఎఫ్-16 విమానం పైలట్‌ను బందీగా పట్టుకున్నది. అంతే కాదు భారత త్రివిధ దళాలు పాక్‌పై ముప్పేట దాడికి దిగాయి. దీంతో పాక్ కకావికలమైపోతున్నది.
న్యూఢిల్లీ, మే 8: దుస్సాహసంతో కాలుదువ్విన పాకిస్థాన్‌కు భారత్ గట్టి గుణపాఠం చెప్తున్నది. పాక్ సైన్యం జరిపిన ఆకస్మిక దాడులను సమర్థవంతంగా తిప్పికొడ్తున్న భారత్.. ఆపరేషన్ సిందూర్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నది. ప్రతీకారంగా ఎదురుదాడి మొదలు పెట్టిన భారత్ వరుసగా జరుపుతున్న ఎదురుదాడులతో దాయాది దేశం బెంబేలెత్తింది. పెషావర్ నుంచి లాహోర్ వరకు దాదాపు అన్ని ప్రధాన నగరాలపై భారత్ ప్రహార్‌కు దిగింది. పలు నగరాలు బాంబుల మోతతో దద్దరిల్లాయి. వరుస దాడులతో దిక్కుతోచని స్థితిలో పడిన పాక్ ప్రభుత్వం దేశమంతటా లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అంతకుముందే పాక్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్ గురువారం రాత్రి దర్జాగా శత్రుదేశంలోకి చొచ్చుకుపోయింది. పెషావర్‌లో భారీ పేలుడు సంభవించిందని, లాహోర్, సియాల్కోట్, కరాచీ, రావల్పిండి నగరాలలో కూడా పేలుళ్లు సంభవించినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇంటి సమీపంలోనే భారీ పేలుడు సంభవించిందని పేర్కొన్నాయి. దీంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలిసింది. ఆయన బంకర్లో తలదాచుకున్నట్టు సమాచారం. పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కూడా సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు.
హైసెక్యూరిటీ జోన్లంటిలోనూ భద్రతను పెంచారు. అన్ని ప్రధాన నగరాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. క్వెట్టాలోని సైనిక స్థావరం లక్ష్యంగా భారత్ దాడి చేసింది. ఈ దాడులన్నింటినీ అరేబియా సముద్రంలో మోహరించిన భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి పర్యవేక్షించినట్టు సమాచారం. తాము దూకుడు వైఖరిని అవలంబించామని ఇండియన్ నేవీ ధ్రువీకరించింది. 26 భారత యుద్ధనౌకలను రంగంలోకి దింపినట్టు వార్తలు వెలువడుతున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో పాక్ గగనతల హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థ (అవాక్స్) విమానాన్ని భారత దళాలు కూల్చివేశాయి. సరిహద్దులోని జమ్ము-నౌషెరా సెక్టార్లో పలు పాక్ సైనిక పోస్టులను భారత్ ధ్వంసం చేసింది. దీంతో పాక్ సైన్యానికి భారీ నష్టం సంభవించినట్టు తెలిసింది. భారత భూభాగంలో పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చివేసిన సైనిక దళాలు ఆ తరువాత శత్రుదేశంలోకి చొచ్చుకుపోయి బీభత్సం సృష్టించింది. దీంతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాక్ ప్రధానితో మాట్లాడి ఉద్రిక్తతలను నివారించాలని సూచించారు. సౌదీ విదేశాంగ మంత్రి సైతం శుక్రవారం పాకిస్థాన్ చేరుకోనున్నారు.
భారత్- పాక్ యుద్ధవాతావరణాన్ని ఆసరాగా చేసుకుని బలూచిస్థాన్ విమోచన సేన రాజధాని క్వెట్టాను స్వాధీనం చేసుకున్నది. బీఎల్ఏ ధాటికి తట్టుకోలేక పాక్ సైన్యం చేతులెత్తేసింది. క్వెట్టా నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక స్థావరాలపై బీఎల్ఏ జెండా ఎగురవేసింది. బలూచ్‌లోని పర్వత ప్రాంతాల్లో పాక్ సైనిక వాహనాన్ని తిరుగుబాటుదారులు పేల్చివేయడంతో 12మంది సైనికులు మృతిచెందారు.