కేంద్ర సాయుధ బలగాల్లో 1,22,555 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో వెల్లడించారు. 9362 ఆఫీసర్ స్థాయి పోస్టులతో కలిపే 1,22,555 పోస్టులు ఖాళీగా ఉన్నాయని లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు. ఒక్క ఆర్మీలోనే 1,04,653 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇక వాయుసేనలో 621 ఆఫీసర్ పోస్టులు, 4850 ఇతరత్రా పోస్టులు ఖాళీగా ఉన్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇక నేవీలో 1265 ఆఫీసర్ పోస్టులతో పాటు 11,166 ఇతరత్రా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
అయితే మొత్తంగా ఏ శాఖలో అధికంగా పోస్టులు ఖాళీలున్నాయని సభ్యులు అడగ్గా…. ఆర్మీలోని పలు విభాగాల్లోనే అత్యధికంగా పోస్టులు ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేసేందుకు తగు చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. యువకులు అత్యధిక సంఖ్యలో ఆర్మీలో చేరడానికి అవగాహన కార్యక్రమాలు, ప్రచారం నిర్వహిస్తామని అజయ్ భట్ తెలిపారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలతో పాటు ఎన్సీన్సీలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తామని అజయ్ భట్ వెల్లడించారు.