న్యూఢిల్లీ : భారత సైన్యం దేశవ్యాప్తంగా పలు కీలక ప్రదేశాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన నవతరం రక్షణ వ్యవస్థలను పరీక్షిస్తున్నది. జోషీమఠ్, పోఖ్రాన్, బబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లలో కూడా ఇటువంటి సామర్థ్య అభివృద్ధి ప్రదర్శనలను నిర్వహిస్తున్నది. ప్రత్యేకంగా ఆగ్రా, గోపాల్‌పూర్‌లలో గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించబోతున్నది. ఈ పరీక్షలన్నీ కృత్రిమంగా సృష్టించిన నియంత్రిత పరిస్థితుల్లో, సమన్వయపరచిన ఎలక్ట్రానిక్ యుద్ధ వాతావరణంలో జరుగుతున్నాయి. అత్యాధునిక రక్షణ వ్యవస్థల పనితీరును మదింపు చేయడమే వీటి లక్ష్యం.
మానవ రహిత గగనతల వ్యవస్థలు (యూఏఎస్), యూఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మ్యునిషన్, రన్‌వే ఇండిపెండెంట్ రిమోట్లీ పైలటెడ్ ఏరియల్ సిస్టమ్స్, కౌంటర్ యూఏఎస్ సొల్యూషన్స్, లోయిటరింగ్ మ్యునిషన్స్, స్పెషలైజ్డ్ వెర్టికల్ లాంఛ్ డ్రోన్స్, ప్రెసిషన్ మల్టీ మ్యునిషన్ డెలివరీ సిస్టమ్స్ తదితర రక్షణ వ్యవస్థలను పరీక్షించి, వాటి సామర్థ్యాన్ని మదింపు చేస్తున్నారు. భవిష్యత్తులో యుద్ధాలు జరిగితే, సమర్థంగా ఎదుర్కొనడానికి భారత సైన్యం సాంకేతిక పరిజ్ఞానంలో ఆధిపత్య స్థాయిలో ఉండటంతోపాటు ఆపరేషనల్‌గా సిద్ధంగా ఉండాలనేది ఈ పరీక్షల లక్ష్యం.