న్యూఢిల్లీ, జూలై 22: అమెరికాతో 2020 ఫిబ్రవరిలో కుదిరిన రూ. 5,691 కోట్ల ఒప్పందం కింద భారతీయ వైమానిక దళానికి అందాల్సిన ఆరు అపాచీ ఏహెచ్ -64 హెలికాప్టర్లలో మూడు మంగళవారం భారత్ చేరుకున్నాయి. అమెరికాకు చెందిన భారీ స్థాయి ఆంటొనోవ్-124 విమానంలో ఈ మూడు అపాచీ హెలికాప్టర్లు న్యూఢిల్లీ శివార్లలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు ఉదయం 10 గంటలకు చేరుకున్నాయి. ఇవి జోధ్‌పూర్‌లోని ఐఏఎఫ్ స్థావరానికి తరలి వెళ్లనున్నాయి. ఎగిరే యుద్ధ ట్యాంకులుగా పిలిచే ఈ హెలికాప్టర్లను పాకిస్థాన్‌కు పశ్చిమ సరిహద్దున గస్తీ కోసం భారత సైన్యం ఉపయోగించనున్నది.
ఇందుకోసం ఈ ఏడాది మార్చిలో అపాచీ స్కాడ్రన్ని సైన్యం ఏర్పాటు చేసింది. భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, ఆకాశం నుంచి భూమిపైని లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, తుపాకులు, రాకెట్లు ఆయుధ సంపత్తితో కూడిన మిగిలిన మూడు అపాచీ యుద్ధ హెలికాప్టర్లను ఈ ఏడాది నవంబర్ నాటికి అమెరికా అందచేయనున్నది. ఇప్పటికే ఆలస్యమైనప్పటికీ చేతికి అందిన మూడు అపాచీ హెలికాప్టర్లతో భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానున్నది. అత్యంత అధునాతనమైన ఈ హెలికాప్టర్లతో అత్యంత సవాలుతో కూడిన సరిహద్దు ప్రాంతాలలో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.