DGMO | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ సిందూర్ లక్ష్యాన్ని ఛేదించామని భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. త్రివిధ దళాలు సమిష్టిగా జరిపిన ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలిపారు. ఇదే సమయంలో.. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యానికి చెందిన ఐదుగురు జవాన్లు వీరమరణం పొందినట్టు చెప్పారు. పలువురు పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారన్నారు. వారందరికీ భారత సైన్యం తరఫున నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు.
ఆదివారం ఢిల్లీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఏకే భార్తి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ ఏఎన్ ప్రమోద్‌తో కలిసి రాజీవ్ ఘాయ్ మీడియా సమావేశం నిర్వహించారు. దాడులకు ముందు, దాడులకు తర్వాత పరిస్థితులను వివరించే ఫొటోలు, వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది ప్రాణాలను బలిగొన్నారు. ఆ భయానక, క్రూరమైన దృశ్యాలను చూసి దేశం మొత్తం చలించిపోయింది. ఈ ఘటనతోపాటు మన సైన్యంపై, పౌరులపై గతంలో జరిగిన ఉగ్రదాడులు కూడా కలిపి చూస్తే.. ఒక దేశంగా మనం గట్టి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది’ అని పేర్కొన్నారు. అందుకే ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనట్టు తెలిపారు. ఉగ్రవాదులతోపాటు వారికి శిక్షణ ఇస్తున్నవారికి, ఉగ్రవాద సంస్థలను శిక్షించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఇందుకోసం అత్యంత సూక్ష్మస్థాయిలో విశ్లేషించి లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకున్నామని చెప్పారు.
పాకిస్థాన్, పీవోకేలో అనేక ఉగ్రస్థావరాలను గుర్తించగా, అందులో ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగుతున్న వాటిని మాత్రమే లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. ఈ నెల 7న దాడులు చేసి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వసం చేశామని చెప్పారు. ఇందులో ముర్దికేలోని లష్కరే తాయిబా ప్రధాన కేంద్రం వంటివి ఉన్నాయన్నారు. ఇందులోనే ఏండ్లుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారన్నారు. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ వంటి వారు ఇక్కడే శిక్షణ పొందారన్నారు. సైన్యం దాడుల్లో యూసుఫ్ అజర్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదసిర్ అహ్మద్ వంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను అంతమొందించినట్టు చెప్పారు. ఐసీ 814 విమానం హైజాక్, పుల్వామా దాడుల్లో పాలుపంచుకున్న ఉగ్రవాదులను ఏరివేశామన్నారు.
భారత వాయుసేన జరిపిన దాడుల్లో ధ్వంసమైన పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లకు సంబంధించిన భారత సంస్థ కవాస్పేస్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు
భారత వాయుసేన యుద్ధవిమానాలు స్పష్టమైన లక్ష్యంతో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఏకే భార్తి తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో వాయుసేన పాత్రను వివరించారు. బహావల్పూర్, ముర్దికేలో జరిపిన దాడుల్లో ఫైటర్ జెట్లు పాల్గొన్నాయన్నారు. ‘ఉగ్రవాద సంస్థల నిర్మాణాలు మాత్రమే మా లక్ష్యం. పాకిస్థాన్ మిలిటరీ కాదు’ అని స్పష్టం చేశారు. అందుకే లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే ప్రిసిషన్ ఎయిర్ మ్యునిషన్స్ (పీఏఎం)లను ప్రయోగించామన్నారు. ఈ నెల 7వ తేదీన పాకిస్థాన్‌కు చెందిన యూఏవీలు, డ్రోన్లు వరదలా భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చాయని, మిలిటరీ ప్రాంతాలు, జనావాసాలపై దాడికి ప్రయత్నించాయని చెప్పారు. సైన్యం వేగంగా స్పందించి వాటిని కూల్చివేసిందన్నారు. 8, 9 తేదీల్లో పాకిస్థాన్ మరోసారి సరిహద్దు వెంబడి డ్రోన్లను ప్రయోగిచిందని, భారత సైన్యం వాటిల్లో అత్యధిక శాతం డ్రోన్లను గాలిలోనే పేల్చివేసిందన్నారు. అంతేకాకుండా పాకిస్థాన్‌కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను కూల్చేశామన్నారు. ‘పాక్ విమానాలు భారత సరిహద్దులోకి రాకుండా అడ్డుకున్నాం. కొన్ని విమానాలను సరిహద్దు దాటకముందే కూల్చేశాం. కాబట్టి మా దగ్గర శిథిలాలు లేవు. అయితే.. ఎన్ని జెట్లను కూల్చామో నాకు తెలుసు. కానీ వివరాలు బయటికి వెల్లడించం’ అని పేర్కొన్నారు. భారత్‌కు చెందిన ఫైటర్ జెట్లను పాక్ కూల్చేసిందంటూ విదేశీ మీడియాలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. భారత పైలట్లు అందరూ సురక్షితంగా తిరిగి వచ్చారన్నారు. ‘మనం యుద్ధ పరిస్థితుల్లో ఉన్నాం. నష్టం ఇరువైపులా ఉంటుంది. కానీ మేం మా లక్ష్యాలను సాధించాం. మా పైలట్లు సురక్షితంగా తిరిగి వచ్చారు’ అని పేర్కొన్నారు.
భారత వాయుసేన జరిపిన దాడుల్లో ధ్వంసమైన పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లకు సంబంధించిన భారత సంస్థ కవాస్పేస్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు
డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ మాట్లాడుతూ.. పహల్గాం దాడి తర్వాత భారత నావికాదళం అరేబియా సముద్రంలో అనేక మిస్సైళ్లను ప్రయోగించిందని చెప్పారు. దీంతో పాకిస్థాన్ నేవీ డిఫెన్స్‌లో పడిపోయిందన్నారు. ఎలాంటి ఆపరేషన్లు చేపట్టడానికైనా భారత నావికాదళం సర్వసన్నద్ధంగా ఉన్నదన్నారు. ‘ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ల ఫలితంగా పాకిస్థాన్ డీజీఎంవో దిగివచ్చి, చర్చలకు ప్రతిపాదించారు’ అని ప్రకటించారు.
భారత్ సైన్యం పోరాటం తీవ్రవాదులపైనే తప్ప పాకిస్థాన్ సైన్యంపై కాదని, అందుకే రక్షణాత్మక వైఖరిని అవలంబించామని చెప్పారు. అయితే.. ‘దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, పౌరుల భద్రతకు ముప్పు కలిగిస్తే ఎవరినీ సహించేది లేదు’ అని స్పష్టం చేశారు. పాకిస్థాన్ పదేపదే దాడులు చేస్తూ, తమకు ప్రతిదాడి చేయడం మినహా మరో మార్గం లేకుండా చేసిందన్నారు. అందుకే పరిమిత సంఖ్యలో, ఎక్కువ నష్టం కలిగించే చోట్ల దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మలిర్ కంటోన్మెంట్‌లోని సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (ఎస్ఏఎం) సిస్టమ్స్, లాహోర్, గుజ్రాన్వాలా సమీపంలోని సర్వేలైన్స్ రాడార్ కేంద్రాలు, మురిద్, చక్లాలా, రహీయార్ ఖాన్, సుక్కుర్‌లోని ఎయిర్ బేస్‌లపై దాడులు చేశామన్నారు. ‘మా వైమానిక దాడులతో పాకిస్థాన్ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్న గట్టి సంకేతాలు పంపించాం’ అని స్పష్టం చేశారు. భారత సైన్యం జరిపిన ప్రతిదాడుల్లో 35-40 మంది పాకిస్థాన్ సైనికులు మరణించినట్టు చెప్పారు. భారత సైన్యం దాడులతో పాకిస్థాన్ సైన్యానికి భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. పాక్‌కు చెందిన కీలక ఆర్మీ స్థావరాలను ధ్వంసం చేశామని, రాజధాని లాహోర్‌కు సమీపంలోని స్థావరాలకు కూడా నష్టం కలిగించామన్నారు. పాక్‌కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను కూల్చేశామని ప్రకటించారు. పాకిస్థాన్ సైన్యం భారత భూభాగంలోకి అడుగు పెట్టలేదని, భారత సైన్యం వారికి ఆ అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు.
భారత త్రివిధ దళాలు జరిపిన దాడుల ఫలితంగా శనివారం మధ్యాహ్నం పాకిస్థాన్ దిగివచ్చిందని చెప్పారు. తనకు హాట్లైన్లో పాకిస్థాన్ డీజీఎంవో నుంచి సందేశం వచ్చిందన్నారు. దాడులను ఆపాలని, చర్చించుకునే మార్గాలు అన్వేషించాలని ప్రతిపాదించారన్నారు. అయితే.. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత కూడా ఈ నెల శనివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున పాకిస్థాన్ సైన్యం సరిహద్దు వెంబడి దాడులు చేసిందని చెప్పారు. దీంతో తాము హాట్లైన్లో మరోసారి పాకిస్థాన్‌తో మాట్లాడామని, ఉల్లంఘనల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశామన్నారు. ‘మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే తీవ్ర స్థాయిలో ప్రతిస్పందన ఉంటుంది’ అని హెచ్చరించినట్టు చెప్పారు. సోమవారం రెండు దేశాల మధ్య డీజీఎంవోల స్థాయి సమావేశం జరుగనున్నదని, కాల్పుల విరమణ తదితర అంశాలపై చర్చిస్తామని చెప్పారు. మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే పాక్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.