Lahore | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ‘ఆపరేషన్ సిందూర్’కు కొనసాగింపుగా భారత త్రివిధ దళాలు చేస్తున్న ప్రతీకార దాడులతో పాకిస్థాన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో బుధవారం అర్ధరాత్రిపూట దొంగ దెబ్బ తీయాలనుకొన్న దాయాదికి ‘సుదర్శన చక్ర’తో గట్టిగా బుద్ధి చెప్పిన భారత సైన్యం.. పాక్ భద్రతకు ఆయువు పైట్టెన లాహోర్‌పై ప్రహార్‌ను ప్రకటించింది. గురువారం ఉదయం ముప్పేట దాడులతో లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థను తుత్తునియలు చేసింది. ఈ మేరకు గురువారం పీఐబీ, రక్షణ, విదేశాంగ శాఖ ధ్రువీకరించాయి.
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో చావుదెబ్బ తిన్న పాక్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. ఈ క్రమంలోనే ఉత్తర, పశ్చిమ భారత్‌లోని 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలను పేల్చేయాలని బుధవారం అర్ధరాత్రి కుటిల యత్నాలకు తెగబడింది. అయితే, ఇది గుర్తించిన భారత సైన్యం రష్యాకు చెందిన ఎస్-400 సిస్టమ్స్ అలియాస్ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాక్ డ్రోన్లు, క్షిపణులను కూల్చేసింది. అయితే, భవిష్యత్తులో కూడా పాక్ ఇలాంటి దాడులకు తెగబడొచ్చన్న కారణంతో పాక్ సైన్యానికి కీలకంగా ఉన్న లాహోర్‌తో పాటు మరో 12 ప్రాంతాల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను ధ్వంసం చేయాలని భారత సైన్యం ఈ సందర్భంగా నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం తొలుత లాహోర్ అనంతరం మరో 12 ప్రాంతాల్లో భారత సైన్యం అత్యాధునిక హారోప్ డ్రోన్లు, శక్తిమంతమైన క్షిపణులతో నిరంతరాయ దాడులు జరిపింది.
ఫొటోలు రాగానే ఎటాక్
హెచ్‌క్యూ-9, 16 ఎయిర్ డిఫెన్స్ సెక్యూరిటీ వ్యవస్థకు సంబంధించిన బ్యాటరీ వ్యవస్థ ఫొటోలు ఎప్పుడైతే చేతికి చిక్కాయో.. ఆ వెంటనే ఇజ్రాయెల్‌కు చెందిన ప్రత్యేకమైన హారోప్ డ్రోన్లు, శక్తిమంతమైన క్షిపణులతో భారత సేనలు దాడులను మొదలుపెట్టాయి. అలా సెకండ్ల వ్యవధిలో ఆ బ్యాటరీ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది. దీంతో హెచ్‌క్యూ-9, 16 ఎయిర్ డిఫెన్స్ సెక్యూరిటీ వ్యవస్థకు అవసరమైన సిగ్నలింగ్ దాదాపుగా నిలిచిపోయింది. ఆ వెంటనే పెద్దయెత్తున దాడులను ఉద్ధృతం చేసిన భారత సైన్యం అలా మొత్తంగా లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థను భస్మీపటలం చేసేసింది.
లాహోర్ ఆగమాగం
గురువారం ఉదయం లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత సేనలు డ్రోన్లు, క్షిపణులతో ఎప్పుడైతే తుత్తినియలు చేశాయో.. నగరం అంతటా భారీ శబ్దంతో సైరన్లు మోగడం ప్రారంభించాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు వీధుల్లో పరుగులు తీస్తూ కనిపించారు. డిఫెన్స్ సిస్టమ్‌ను కూల్చేసే క్రమంలో కొన్ని శకలాలు స్థానికంగా ఉన్న వాల్టన్ ఎయిర్పోర్ట్, లాహోర్ సెంట్రల్, లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో పడినట్టు అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కొన్ని చోట్ల పేలుళ్ల శబ్దం వినిపించినట్టు పేర్కొన్నాయి. దట్టమైన పొగ అలుముకున్న చిత్రాలు, వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో లాహోర్ ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో లాహోర్‌లోని తమ పౌరులు, దౌత్యవేత్తలు, యాత్రికులు ఎయిర్పోర్ట్, కంటోన్మెంట్ ఏరియాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అమెరికా అడ్వైజరీ జారీ చేసింది.
డజను నగరాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం
‘ఆపరేషన్ సిందూర్’కు కొనసాగింపుగా భారత త్రివిధ దళాలు గురువారం ఉదయం ముప్పేట దాడులతో పాకిస్థాన్‌లోని లాహోర్ సహా 12 నగరాల్లోని గగనతల రక్షణ వ్యవస్థను తుత్తినియలు చేసిం ది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనమైన నగరాల జాబితాలో లాహోర్, కరాచీ, రావల్పిండి, సియాల్కోట్, ఇస్లామాబాద్, గుజ్రాన్వాలా, చక్వాల్, బహావాల్పూర్, మియానో, ఛోర్, అట్టోక్ మరో ప్రాంతం ఉన్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఆపరేషన్ స్ట్రాటజీ ఇలా..
లాహోర్ భద్రతను పర్యవేక్షించడంలో భాగంగా హెచ్‌క్యూ-9, 16 ఎయిర్ డిఫెన్స్ సెక్యూరిటీ వ్యవస్థను 2017లో చైనా నుంచి పాక్ ఆర్మీ కొనుగోలు చేసింది. దీనికోసం రూ. 1,872 కోట్లు (పాక్ కరెన్సీ) వెచ్చించింది. 40 కిలోమీటర్ల నుంచి 125 కిలోమీటర్ల పరిధుల్లోని ఎయిర్‌క్రాఫ్ట్, క్రూయిజ్ క్షిపణులు, యూఏవీలు, చిన్న, మధ్యస్థాయి బాలిస్టిక్ క్షిపణులను గుర్తించడంతో పాటు వాటిని పేల్చగల సామర్థ్యం ఈ వ్యవస్థ సొంతం. ఇది తెలిసిన భారత ఆర్మీ ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది. చైనాకు చెందిన హెచ్‌క్యూ-9, 16 ఎయిర్ డిఫెన్స్ సెక్యూరిటీ వ్యవస్థను నాశనం చేయాలంటే ముందుగా దాని బ్యాటరీ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని తెలుసుకొన్నది. ఈ క్రమంలోనే సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ (సీడ్) ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తొలుత బ్యాటరీ వ్యవస్థను గుర్తించడానికి రాడార్‌ను తప్పుదోవ పట్టించే ప్రత్యేక డ్రోన్లను ప్రయోగించి లైవ్ ఫొటోలను తెప్పించుకొన్నట్టు రక్షణ రంగ నిపుణులు తెలిపారు.