Indian Army | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ‘కుక్క తోక వంకర’ అన్నట్టు పాకిస్థాన్ బుద్ధి ఏ మాత్రం మారడంలేదు. ఉగ్రమూకలకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా భారత్‌పై వారిని ఎగదోయడమే నిత్యకృత్యంగా పెట్టుకొన్న దాయాదికి ‘ఆపరేషన్ సిందూర్’తో భారత సైన్యం తగిన బుద్ధి చెప్పింది. అయినప్పటికీ, తన వైఖరిని మార్చుకోని పాక్.. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్‌ను దొంగ దెబ్బ తీయాలనుకొన్నది. ఇందులో భాగంగా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని 15 కీలక నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించింది. అయితే, దుష్ట సంహారం కోసం అలనాడు శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రాన్ని వాడినట్టే.. మళ్లీ ఇప్పుడు పాక్ దాడులను తిప్పికొట్టడానికి భారత రక్షణ దళం ఎస్-400 ‘సుదర్శన చక్ర’ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను వినియోగించింది. దీంతో పాక్ డ్రోన్లు, క్షిపణులు సెకండ్ల వ్యవధిలోనే తునాతునకలయ్యాయి. ఎప్పటికైనా ధర్మానిదే విజయం అని దీంతో మరోమారు రుజువైంది.
‘ఆపరేషన్ సిందూర్’తో గట్టి ఎదురుదెబ్బ తగిలిన పాకిస్థాన్.. భారత్‌పై ప్రతీకార చర్యలకు విఫలయత్నం చేసింది. భారత్‌లోని కీలక నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలపై బుధవారం అర్ధరాత్రి డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించింది. అయితే, అప్పటికే పూర్తి అప్రమత్తతతో ఉన్న భారత సైన్యం ఆ దాడులను తిప్పికొట్టడమే కాకుండా అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో ఆయా డ్రోన్లను, క్షిపణులను సెకండ్ల వ్యవధిలో పేల్చేసింది. దీంతో ఆయా శకలాలు దేశంలోని పలు ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ మేరకు పీఐబీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కుటిల యత్నం ఇలా..
మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో పాక్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర శిబిరాలు నేలమట్టమయ్యాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన పాక్.. ఉత్తర, పశ్చిమ భారత్‌లోని 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలను పేల్చేయాలని కుటిల యత్నాలకు తెగబడింది. ఇందులో భాగంగా శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్ ఇలా 15 నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. అయితే, అప్పటికే అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం.. తమ వైపునకు దూసుకువస్తున్న పాక్ డ్రోన్లను, క్షిపణులను ఇట్టే గుర్తించాయి. వెంటనే అలర్ట్ అయిన భారత రక్షణ వ్యవస్థ.. పాక్ డ్రోన్లు, క్షిపణులను పేల్చేయడానికి ఇంటిగ్రేటెడ్ యూఏఎస్ గ్రిడ్, రష్యాకు చెందిన ఎస్-400 సిస్టమ్స్ అలియాస్ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేశాయి. దీంతో సెకండ్ల వ్యవధిలో ఆయా రక్షణ వ్యవస్థలు పాక్‌కు చెందిన డ్రోన్లు, క్షిపణులను పేల్చేశాయి. వాటి శకలాలు పంజాబ్ సహా పలు ప్రాంతాల్లో పడిపోయినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
శకలాల కోసం గాలింపు
పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను సమర్థంగా ఎదుర్కొని వాటిని పేల్చేసిన భారత సైన్యం.. వాటి శకలాల కోసం ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలను మొదలుపెట్టింది. పాక్ దాడులను రుజువు చేయడంలో భాగంగానే ఈ గాలింపు చర్యలు మొదలుపెట్టినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
పాక్ టార్గెట్ చేసిన నగరాలు ఇవే:
అవంతీపుర, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూదియానా, అదామ్‌పుర్, భఠిండా, చండీగఢ్, నాల్, ఫలోడీ, ఉత్తర్లాయి, భుజ్.