లడాఖ్: తూర్పు లడాఖ్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఇండియా తన కొత్త ఆయుధాన్ని మోహరించింది. చైనా సరిహద్దులో ఉన్న లైన్ ఆఫ్ యాక్టువల్ కంట్రోల్ వద్ద తొలిసారి కే9- వజ్రా హోవిజ్జర్ గన్నులను ఇండియన్ ఆర్మీ ఎక్కుపెట్టింది. కే9-వజ్రా గన్ సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శుత్రు టార్గెట్లను ధ్వంసం చేయగలదు. కే9-వజ్రా హోవిజ్జర్‌కు చెందిన రెజిమెంట్‌ను మొత్తాన్ని లడాఖ్‌లో మోహరించినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే తెలిపారు. కే9 వజ్రా ఆయుధాలు హై ఆల్టిట్యూడ్ ఏరియాల్లోనూ పనిచేస్తాయని చెప్పారు. ఫీల్డ్ ట్రయల్స్ సమయంలో హోవిజ్జర్ గన్నులు చాలా సక్సెస్ రేటును చూపినట్లు ఆయన తెలిపారు. కే9 రెజిమెంట్‌ను పూర్తిగా ఇక్కడ మోహరించడం వల్ల అది మనకు ఎంతో ఉపకరిస్తుందని మనోజ్ ముకుంద్ చెప్పారు.
#WATCH K9-Vajra self-propelled howitzer in action in a forward area in Eastern Ladakh pic.twitter.com/T8PsxfvstR
— ANI (@ANI) October 2, 2021
చైనా ఫార్వర్డ్ ప్రాంతాల్లో దళాలు..
గత ఆరు నెలల నుంచి లడాఖ్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అక్టోబర్ రెండవ వారంలో చైనా సైనిక దళాలతో 13వ రౌండ్ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లు ఆర్మీ చీఫ్ చెప్పారు. ఆ చర్చల్లో దళాల ఉపసంహరణపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. అన్ని సమస్యాత్మక ప్రాంతాలను క్లియర్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. చైనాతో నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చల ద్వారా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని నమ్ముతున్నట్లు నరవాణే తెలిపారు. ఈస్ట్రన్ లడాఖ్, నార్తర్న్ ఫ్రంట్ నుంచి ఈస్ట్రన్ కమాండ్ వరకు చైనా తన సైన్యాన్ని మోహరించిందని, చైనా తన ఫార్వర్డ్ ప్రాంతాల్లో దళాలను పెంచిందని, ఇది కొంత ఆందోళనకరమైన అంశమని నరవాణే తెలిపారు.
సరిహద్దు వెంట చైనా దళాల కదిలికలను నిత్యం గమనిస్తూనే ఉన్నామని, తమకు వచ్చిన సమాచారం మేరకు, తగిన రీతిలో సరిహద్దు ప్రాంతాల్లో సైనిక సదుపాయాలను పెంచుతున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే రీతిలో సంసిద్దం అవుతున్నట్లు ఆయన చెప్పారు. పాకిస్థాన్ చొరబాట్లు, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల మార్పులను కూడా గమనిస్తున్నట్లు ఆయన తెలిపారు.