Indian Air Force | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సందర్భంగా ఎయిర్‌ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. వాయుసేన బుధవారం భారీ స్థాయిలో వైమానిక విన్యాసాలు నిర్వహించబోతున్నది. రాజస్థాన్‌తో సహా పాక్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఈ విన్యాసాలు కొనసాగనున్నాయి. సుమారు ఐదుగంటల పాటు విన్యాసాలు కొనసాగుతాయి. బుధవారం రాత్రి 9.30 నుంచి తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్నాయి. విన్యాసాల సందర్భంగా సరిహద్దు సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్టుల్లో విమానాల రాకపోలకు రద్దు చేశారు. ఈ విన్యాసాల్లో రఫేల్, మిరాజ్-200, సుఖోయ్30 సహా భారత్ అమ్ములపొదిలో ఉన్న పలు ప్రముఖ విమానాలన్నీ పాల్గొననున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటీస్ (NOTAM) జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని సోమవారం లేఖ రాసిన విషయం తెలిసింది. శత్రుదేశం దాడి చేసిన సందర్భంలో పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియజేసేందుకు ఈ డ్రిల్‌ని నిర్వహించాలని సూచించింది. ఎయిర్ స్ట్రయిక్స్ దాడి హెచ్చరిక సైరన్ డ్రిల్స్ , పౌర రక్షణ (ఆత్మరక్షణ)లో పౌరులకు శిక్షణ, బ్లాక్అవుట్ వ్యవస్థ పై అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే చాలా చోట్ల సిబ్బంది రిహార్సల్స్ చేపట్టారు. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలనేదానిపై అవగాహన పెంపొందించుకుంటున్నారు. మంటలు ఎలా ఆర్పాలి, గాయపడిన వారిని ఎలా తరలించాలి, ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలనేవి ఈ రిహార్సల్స్ చేపట్టారు. దేశంలోని 244 పౌర రక్షణ జిల్లాల్లో డ్రిల్స్ జరుగనున్నాయి.