న్యూఢిల్లీ: గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం రక్షణ శాఖ అధికారులు వెంటవెంటనే తూర్పు లఢఖ్‌లో భారీగా బలగాలను మోహరించారు. పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని అక్కడికి చేరవేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌ల ద్వారా వివిధ విభాగాల నుంచి దాదాపు 68 వేల మందికి పైగా సైనికులను లఢఖ్‌కు తరలించారు.
అదేవిధంగా 90 యుద్ధ ట్యాంకులను, 330 BMP ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికిల్స్‌ను, రాడార్ వ్యవస్థలను, ఆర్టిలరీ గన్స్‌ను, ఇంకా ఇతర సరంజామాను డిఫెన్స్ అధికారులు తూర్పు లఢఖ్ ప్రాంతానికి చేరవేశారు. గగనతలంలో గస్తీ కోసం మిగ్-29, Su-30 MKI యుద్ధ విమానాలను రంగంలోకి దించారు. మళ్లీ ఎలాంటి ఘర్షణ జరిగినా సమర్థంగా తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు.
ఈ విషయాన్ని భారత రక్షణ శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. కాగా, 2020 జూన్ 15న తూర్పు లఢఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రెండు దేశాల సైనికాధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి.