న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ తర్వాత డిజిటల్ రుపీని పరిచయం చేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ త్వరలోనే డిజిటల్ కరెన్సీ దేశంలో అందుబాటులోకి రానుందని స్పష్టం చేశారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ).. బ్లాక్‌చైన్ ఆధారిత వ్యాలెట్ల వినియోగం ద్వారా లావాదేవీలను జరుపనున్నది. అయితే పలు మినహాయింపులతో దేశంలో అన్ని ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై నిషేధం అమలయ్యేలా బిల్లును తీసుకురావాలని చూస్తూనే.. డిజిటల్ కరెన్సీ దిశగా కేంద్రం ఉరుకుతుండటం ఆసక్తికరం.
బ్లాక్‌చైన్ టెక్నాలజీతో..
కొత్త డిజిటల్ రుపీ బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా నడుస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఇదే బ్లాక్‌చైన్ టెక్నాలజీతోనే క్రిప్టో కరెన్సీ, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్, నాన్ ఫంగిబుల్ టోకెన్స్ నడుస్తుండటం గమనార్హం. నిజానికి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ క్రిప్టో కరెన్సీలు ఆందోళనకరమని ఇప్పటికే పలుమార్లు అభిప్రాయపడ్డది తెలిసిందే.
ప్రభుత్వం ఏం చెప్తున్నది?
ఈ డిజిటల్ కరెన్సీ.. డిజిటల్ ఎకానమీకి కొండంత బలాన్నివ్వగలదని కేంద్రం చెప్తున్నది. ముఖ్యంగా కరెన్సీ నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చడానికి, మరింత పారదర్శకంగా మార్చడానికి దోహదం చేయగలదని నిర్మలా సీతారామన్ అంటున్నారు. ‘డిజిటల్ కరెన్సీ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కరెన్సీ నిర్వహణ వ్యవస్థను సరళతరం చేస్తుంది. బ్లాక్‌చైన్, ఇతర టెక్నాలజీల ఆధారంగా ఈ డిజిటల్ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ తీసుకువస్తుంది’ అన్నారు.
డిజిటల్ కరెన్సీ ఎక్కడెక్కడ?
డిజిటల్ కరెన్సీ భారత్‌లోనేగాక మరికొన్ని దేశాల్లోనూ ఉన్నది. గతేడాది అక్టోబర్‌లో నైజీరియా ‘ఈనైరా’ను ప్రారంభించింది. బహమాస్తోపాటు తూర్పు కరేబియన్‌లోని ఐదు ఇతర ద్వీపాల్లోనూ ఈ తరహా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను పరిచయం చేశారు. ఇక అమెరికా, చైనా, యూరప్ కూడా డిజిటల్ కరెన్సీలతో ప్రయోగాలు చేస్తున్నాయి. అమెరికాలో ‘డిజిటల్ డాలర్’, చైనాలో ఈ-యువాన్, ఐరోపాలో డిజిటల్ యూరోలు డిజిటల్ లీగల్ టెండర్లుగా ఉన్నాయి.
‘డిజిటల్ రుపీ కోసం ఎప్పట్నుంచో వేచిచూస్తున్నాం. అయితే క్రిప్టో ఆస్తులపై పన్నులు, దాంతో డిజిటల్ రూపీకి లాభాలు తెలియాలి.’
-ప్రణయ్ భాటియా, బీడీవో ఇండియా పార్ట్నర్
‘మూలధన లాభాలుగా క్రిప్టో కరెన్సీలపై పన్ను వేయరనే అనుకుంటున్నాం. వ్యాపార ఆదాయంగా పన్ను వేయవచ్చనిపిస్తున్నది. క్రిప్టో ఆస్తుల పన్నుపై ప్రభుత్వం సంప్రదాయ వైఖరిని తీసుకున్నది.’
-ఏకేఎం, శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ ప్రతినిధులు
డిజిటల్ రుపీ అంటే?
డిజిటల్ రుపీ లేదా డిజిటల్ కరెన్సీ అంటే చట్టబద్ద ద్రవ్యం (లీగల్ టెండర్). ప్రభుత్వాల చేత గుర్తించబడి, రిజర్వ్ బ్యాంక్‌ల ద్వారా చలామణిలో ఉండే డిజిటల్ రూపంలోని నగదు. డిజిటల్ కరెన్సీలు కేంద్రీకృతమై ఉంటాయి. అంటే ఏదైనా బ్యాంక్ నియంత్రిత నెట్వర్క్ పరిధిలోనే వీటి లావాదేవీలు జరుగుతాయి. సంప్రదాయ కరెన్సీకి డిజిటల్ రూపంలో ఉన్న వీటి బదిలీ, కొనుగోళ్లకు వీలున్నది.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ అంటే బ్లాక్చైన్పై నిర్మితమైన అదృశ్య నగదు. వీటి నియంత్రణ ఫలానా వారి చేతిలో ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. నిర్దేశిత వ్యవస్థ లేదు కాబట్టి లావాదేవీలు జరిపేవారే క్రిప్టో కరెన్సీల రెగ్యులేటర్లు. అందుకే వీటి విలువలో ఎప్పటికీ స్థిరత్వం ఉండదు. జవాబుదారీ తనం కూడా లేదు. మోసాలకు అవకాశాలు ఎక్కువ.
స్టార్టప్‌లకు ప్రోత్సాహం
కేంద్ర తాజా బడ్జెట్లో స్టార్టప్‌లకు పన్ను ప్రోత్సాహకం ఒక సంవత్సరం పాటు పెంచారు. స్టార్టప్‌లకు ఉపశమనంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. కరోనా నేపథ్యంలో స్టార్టప్‌లకు పన్ను రాయితీలు మూడేండ్ల నుంచి నాలుగేండ్లకు పెంచుతున్నామని ప్రకటించారు. స్టార్టప్‌ల కార్యకలాపాల్లో ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో ఉండ గా, దేశంలో ఢిల్లీ, బెంగళూరు మహానగరాల తర్వాత హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. దీని వెనుక తెలంగాణ ప్రభుత్వ నిరంతరం కృషి ఉందని నిపుణులు అంటున్నారు. కేంద్ర బడ్జెట్లో స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ప్రకటించడం హర్షణీయమని టీ-హబ్ సీఈవో ఎంఎస్ రావు పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణ స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం చేయడానికి నాబార్డ్ ద్వారా నిధులు సమకూర్చడం, డ్రోన్‌ను ఒక సేవగా ప్రోత్సహించడం, కొత్త తయారీ కంపెనీలకు 15 శాతం రాయితీ కార్పొరేట్ పన్ను వంటివి స్టార్టప్ రంగాన్ని బలోపేతం చేస్తాయన్నారు.
మరింత వేగంగా స్టార్టప్‌లు: జయేశ్ రంజన్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ
స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నది. తాజా కేంద్ర బడ్జెట్లో స్టార్టప్‌లకు ఇచ్చిన ప్రోత్సాహకాలతో మరింత వేగంగా స్టార్టప్ కార్యకలాపాలు చోటు చేసుకుంటాయి.