న్యూఢిల్లీ: దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అందుకోసం వ్యక్తిగతంగా ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధమేనని చెప్పారు. భారత్ దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన క్రమంలో మోదీ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ జయంతి సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ‘రైతుల ప్రయోజనాలకే మా అగ్ర ప్రాధాన్యత. రైతులు, పాడి రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంతో భారత్ ఎన్నడూ రాజీపడదు’ అని అన్నారు. స్వామినాథన్ గౌరవార్థం స్మారక నాణేన్ని విడుదల చేశారు.