Rajnath Singh : పాకిస్థాన్ (Pakistan) ను ఉద్దేశించి భారత రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ పౌరుల రక్షణ కోసం భారత్ ఏ హద్దులనైనా మీరుతుందని ఆయన గట్టిగా చెప్పారు. దేశ పౌరుల భద్రతకు, దేశ సమగ్రతకు ముప్పు పొంచి ఉంటే ఎలాంటి నిర్ణయాత్మక చర్యలకు దిగుతామో ఇప్పటికే నిరూపించామని అన్నారు.
2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్, ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అందుకు నిదర్శనమని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JITO) నిర్వహించిన ‘JITO connect’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్ భూభాగంలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు తాము మతం చూడలేదని, కానీ పహల్గాంలో పౌరులను మతం అడిగి చంపారని రాజ్‌నాథ్ మండిపడ్డారు.
తమ ప్రభుత్వం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని, సైన్యం జోలికిగానీ, సాధారణ పౌరుల జోలికిగానీ వెళ్లలేదని రాజ్‌నాథ్ చెప్పారు. మేం ఆ పని చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లమని, కానీ తాము అలా చేయలేదని అన్నారు.