PM Modi | న్యూఢిల్లీ, అక్టోబర్ 16: కేంద్రంలోని నరేంద్ర సర్కారు దౌత్య విధానం విఫలమైనట్టు కనిపిస్తున్నది. ఇటీవలి కాలంలో అనేక దేశాలతో భారత దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా కెనడాతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. అలాగే పొరుగు దేశాలకే ప్రథమ ప్రాధాన్యం అంటూ మోదీ ప్రభుత్వం తీసుకున్న ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ పాలసీ ఫలితాలనివ్వడం లేదు.
పొరుగు దేశాలు క్రమంగా భారత్‌కు దూరమై, చైనాకు దగ్గరవుతున్నాయి. మాల్దీవులు, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లో భారత వ్యతిరేక, చైనా అనుకూల శక్తులు అధికారంలోకి వచ్చాయి. మరోవైపు చాలాకాలంగా భారత్‌తో మంచి సంబంధాలు కలిగి ఉన్న ఇరాన్ ఇటీవల విమర్శలు చేసింది. దీంతో పొరుగు దేశాలతో పాటు కీలక భాగస్వామ్య దేశాలతో సంబంధాలు, దౌత్యం విషయంలో మోదీ సర్కారు విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గత నెల శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దిస్సనాయకే బాధ్యతలు స్వీకరించారు. ఆయన భారత వ్యతిరేకిగా, చైనా అనుకూల వ్యక్తిగా ముద్రపడ్డారు. పలుమార్లు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన నేపథ్యం ఆయనది.
ఇటీవల దేశంలో భారత, హిందూ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. భారత అనుకూల వ్యక్తిగా ముద్రపడిన షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయారు. భారత వ్యతిరేక శక్తుల చేతికి అధికారం వెళ్లింది.
మాల్దీవులలో గత ఏడాది భారత వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. ‘ఇండియా ఔట్’ నినాదంతో భారత వ్యతిరేకి, చైనా అనుకూల వ్యక్తి అయిన మహమ్మద్ ముయిజ్జు అధ్యక్షుడయ్యారు. ఆయన భారత వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారు.
మూడేండ్ల క్రితం పాకిస్థాన్ మద్దతు గల తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి భారత్ – అఫ్గాన్ సంబంధాలతో పాటు భారత్ చేపట్టిన ప్రాజెక్టులూ నిలిచిపోయాయి.
నేపాల్ ప్రధానమంత్రిగా కృష్ణ ప్రసాద్ శర్మ ఓలీ(కేపీ శర్మ ఓలీ) ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఆయన భారత వ్యతిరేకిగా, చైనా అనుకూల వ్యక్తిగా ముద్రపడ్డారు.
గత నెల ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ భారత్‌పై చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. ‘భారత్‌లో ముస్లింలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకపోతే మనల్ని మనం ముస్లింలు పరిగణించలేం’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి భారత్ గట్టిగా కౌంటర్ ఇచ్చినప్పటికీ ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు. ఇటీవల సిక్కు అతివాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తలను అనుమానితుల జాబితాలో చేర్చాలని కెనడా నిర్ణయించడం ఇరుదేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది.
ఒకవైపు అనేక దశాబ్దాలుగా భారత్‌కు మిత్రదేశాలుగా కొనసాగిన వాటితో ఇప్పుడు దూరం పెరుగుతుండగా మరోవైపు మన దేశానికి చెందిన అదానీ సంస్థల వ్యాపార విస్తరణ సైతం భారత్‌కు ఇబ్బందిగా మారుతున్నది. బంగ్లాదేశ్, కెన్యా, శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అదానీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు భారత్‌పై అక్కడి ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి.