High Court | కొచ్చి: వివాహ సమయంలో వధువుకు బహుమతిగా ఇచ్చిన బంగారం, నగదు ప్రత్యేకంగా ఆమెకు చెందిన ఆస్తులు అవుతాయని, అవి స్త్రీ ధనమని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇటువంటి ఆస్తులపై మహిళలకు చట్టబద్ధమైన హక్కు ఉందని పునరుద్ఘాటించింది. ఎర్నాకుళం, కలమసెరికి చెందిన మహిళ దాఖలు చేసిన అపీలుపై ఈ తీర్పునిచ్చింది.
విడాకుల ప్రొసీడింగ్స్ నేపథ్యంలో ఆమె కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వివాహ సమయంలో తనకు లభించిన ఆస్తిని తిరిగి తనకు ఇప్పించాలని కోరారు. అందుకు ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. దీనిపై ఆమె హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టు తీర్పు చెప్తూ, ఇటువంటి విలువైన ఆస్తులను భర్త లేదా అతని తరపు బంధువులు దుర్వినియోగపరుస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయని చెప్పింది.
మహిళలు వాటిపై యాజమాన్య హక్కులను లేదా వాటిని తన వద్ద నుంచి అన్యాయంగా లాక్కున్నారని పత్రాల ఆధారంగా రుజువు చేయడం సాధ్యం కాదని తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు ఏది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో పరిశీలించి న్యాయాన్ని అందజేయాలని చెప్పింది. ముఖ్యంగా, పెళ్లి బహుమతులు వ్యక్తిగత, దస్తావేజుల రహిత స్వభావం కలవి అని వివరించింది. ఇటువంటి సందర్భాల్లో స్పష్టమైన చట్టబద్ధత గల రుజువు కోసం పట్టుబట్టడం అవాస్తవికత అవుతుందని పేర్కొంది. తన తల్లిదండ్రులు ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్ముతో తనకు ఆభరణాలను కొన్నారని పిటిషనర్ ఆధారాలను చూపించారు.